టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఆ సంస్థలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. డిజాస్టర్లూ ఉన్నాయి. ఐతే మైత్రీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన వాటిలో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో ఒకటిగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని చెప్పొచ్చు. 2018లో విడుదలైన ఈ చిత్రంపై అప్పట్లోనే రూ.40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కరవయ్యాయి. ఆ సమయానికి రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఫామ్‌లో లేని శ్రీను వైట్లను నమ్మి గట్టి ఎదురు దెబ్బే తింది మైత్రీ సంస్థ.
ఇలాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నిర్మాణ సంస్థ మళ్లీ పని చేయడం కష్టమే. కానీ మైత్రీ అధినేతలు మాత్రం వైట్లకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత ఐదేళ్ల పాటు కనిపించకుండా పోయిన వైట్ల.. తర్వాత చాలా కష్టపడి ‘విశ్వం’ సినిమాను సెట్ చేసుకున్నాడు. దానికీ మేకింగ్ మధ్యలో ఇబ్బందులు తలెత్తాయి. పీపుల్స్ మీడియా సంస్థ సాయంతో బయటపడ్డాడు. గత ఏడాది చివర్లో రిలీజైన ‘విశ్వం’ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. వైట్ల గత చిత్రాల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు.
దీంతో ఆయనకు లైఫ్ లైన్ దొరికినట్లయింది. మైత్రీ సంస్థలో ఒక సినిమా చేయడానికి అంగీకారం కుదిరిందట. ‘సామజవరగమన’ రైటర్లు భాను-నందులతో కలిసి వైట్ల ఒక స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. వీళ్లిద్దరూ ‘విశ్వం’కు పని చేస్తున్నపుడే.. వైట్లతో కలిసి మరో కథనూ రెడీ చేశారట. ఆ కథే మైత్రీ వద్దకు వెళ్లి ఓకే అయింది. ఇక హీరోను ఎంచుకోవడమే తరువాయి. ప్రస్తుతం వైట్ల ఆ పనిలోనే ఉన్నాడు. త్వరలోనే హీరోను ఫైనలైజ్ చేసి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం.