ఇటీవలే థియేటర్ల బంద్ మీద ఎంత రచ్చ జరిగిందో చూశాం. ఎవరు ప్రకటించారు, ఎవరు దీనికి బాధ్యులు అనేది పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిషన్ వాతావరణం బందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంది. జనాలు లేక టికెట్ కౌంటర్లు బోసిపోతున్నాయి. అధిక శాతం షోలు క్యాన్సిలవుతున్న దాఖాలాలు లెక్క బెట్టడం కష్టం. బిసి సెంటర్స్ లో కరెంటు బిల్లులైనా వసూలు కానంత దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. మే రెండో వారం నుంచి చాలా చోట్ల పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. సిబ్బంది జీతాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్వంతంగా నిర్వహించుకుంటున్న ఓనర్లు వాపోతున్నారు.
దీని వల్ల నష్టం డిస్ట్రిబ్యూటర్ కా నిర్మాతకా లేక యజమానికా అనేది పక్కన పెడితే ఇండస్ట్రీ తీవ్రంగా ప్రభావితం చెందుతోంది. హిట్ 3 ది థర్డ్ కేస్ తర్వాత ఏ ఊళ్ళోనూ హాలు మొత్తం నిండిన ఉదాహరణలు లేవు. శ్రీవిష్ణు సింగిల్ బిజినెస్ డీసెంట్ గా జరిగింది కనక లాభాలతో బయటపడింది. మొన్న థగ్ లైఫ్ సాయంత్రం షోకే చేతులు ఎత్తేసింది. శ్రీశ్రీశ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్ ని ఆయా హీరోలే లైట్ తీసుకుంటే జనాలు మాత్రం ఎందుకు సీరియస్ గా చూస్తారు. నిన్న వారం భైరవం రిజల్ట్ కూడా అంతంతమాత్రంగానే వచ్చింది. బ్రేక్ ఈవెన్ లో యాభై శాతం రికవరీ కాలేకపోవడం ట్రాజెడీ. 23, ఎలెవన్ కు సోషల్ మీడియా మెప్పులే తప్ప డబ్బులు రాలేదు.
ఇలా నాలుగు వారాలకు పైగా డ్రై పీరియడ్ చూస్తున్న థియేటర్లకు ఇదే సిచువేషన్ ఇంకో పది రోజులు కొనసాగేలా ఉంది. కుబేర వచ్చే దాకా ఎలాంటి మార్పు ఉండదు. హరిహర వీరమల్లు జూన్ 12 వదిలేశాక టైం తక్కువగా ఉండటంతో వేరే హీరోలెవరూ దాన్ని వాడుకునే ఛాన్స్ లేకపోయింది. దీంతో ఈ శుక్రవారం డ్రైగానే గడిచిపోనుంది. కుబేర కనక హిట్టయితే మళ్ళీ సందడి వాతావరణం చూడొచ్చు. బయ్యర్లు ఆ నమ్మకంతోనే ఉన్నారు. హీరోలు స్పీడ్ పెంచి క్రమం తప్పకుండా సినిమాలు చేస్తే ఈ తీవ్రత తగ్గే అవకాశాలను కొట్టి పారేయలేం. ఆ దిశగా ఆలోచించి ఇలాంటి సంక్షోభాలు రాకుండా చూసే బాధ్యత అందరి మీదా ఉంది.