ఎస్ఎస్ఎంబి 29…రామాయణం లింక్ ?

మహేష్ బాబు 29 షూటింగ్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం పూజా కార్యక్రమం ఫోటోలు కూడా బయటకి ఇవ్వకుండా రాజమౌళి తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అయినా ఏదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉన్నాయి. పృథ్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం ఆయనగా చెప్పలేదు. కానీ బయటికి వచ్చేసింది. నానా పాటేకర్, విక్రమ్ నో చెప్పింది, మాధవన్ సానుకూలంగా ఉన్న న్యూసులు ఏదో ఒక రూపంలో తిరుగుతూనే ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రియాంకా చోప్రా ఉన్న సంగతి కూడా జక్కన్న అఫీషియల్ గా బయట పెట్టలేదు. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి మంచి గూస్ బంప్స్ ఇచ్చే టాక్ ఒకటి ఎంట్రీ ఇచ్చింది.

ఈ ప్యాన్ ఇండియా మూవీ అడవి నేపథ్యంలో జరిగే సంగతి తెలిసిందే, ఇండియానా జోన్స్ స్పూర్తితో ఒక టెర్రిఫిక్ సబ్జెక్టు తయారు చేశామని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. తాజా లీక్ ఏంటంటే దీనికి రామాయణంకి ముడిపెట్టారట. అదెలా అంటే మేరు పర్వతం గుర్తుందిగా. ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించాడనికి సంజీవిని మూలికలు కావాలని సుశేణ వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తేవడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం కొండను ఎత్తుకొచ్చి లక్ష్మణుడిని కాపాడుకుంటాడు.

ఇప్పుడీ సంజీవిని మూలికలే ఎస్ఎస్ఎంబి 29లో ఒక కీలక ట్విస్టుకి దారి తీస్తాయట. మహేష్ బాబు వాటిని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించబోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇది నిజమో కాదో కానీ వింటేనే మంచి హై ఇచ్చేలా ఉంది. అసలు సాధ్యమే కానీ అల్లూరి సీతారామరాజు-కొమరం భీం కలయికని సాధ్యం చేసిన జక్కన్న ఇప్పుడీ సంజీవనిని ఫారెస్ట్ అడ్వెంచర్ లో చూపించడం పెద్ద కష్టమేమి కాదు. త్వరలో ఆఫ్రికా వెళ్ళబోతున్న మహేష్ రాజమౌళి టీమ్ అక్కడ చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేసుకోనుంది. 2027లో సినిమా విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు.