-->

చరణ్ సినిమాకే టైం చాలదు…ఇక షారుఖ్ కూడానా

దర్శకుడు సుకుమార్ త్వరలో షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నాడని, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుందని ముంబై మీడియా రెండు మూడు రోజులుగా తెగ ఊదరగొడుతోంది. ఇప్పట్లో ఇది జరిగే పని కాదనే వాస్తవాన్ని విస్మరించి తెలివిగా పుష్ప డైరెక్టర్ విత్ కింగ్ ఖాన్ అంటూ హెడ్డింగులు పెట్టి తెగ ఊరిస్తోంది. ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే ఇందులో నిజానిజాలేంటో బయట పడతాయి. ముందుగా సుకుమార్ చేతిలో రామ్ చరణ్ 17 అనే పెద్ద బాధ్యత ఉంది. ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. తన టీమ్ తో కలిసి తయారు చేసే పనిలో ఉన్నారు. ఎంతలేదన్నా ఇంకో రెండు మూడు నెలలు పట్టేలా ఉంది.

ప్రీ ప్రొడక్షన్ కు మరో ఏడెనిమిది నెలలు అవసరం పడొచ్చని అంటున్నారట. అంటే మొత్తంగా సెట్స్ పైకి వెళ్ళడానికి అంతా కలిపి ఏడాది పైనే సమయం పడుతుంది. ఈలోగా పెద్ది ఈజీగా అయిపోతుంది కాబట్టి దాని తర్వాత త్రివిక్రమ్ తో రామ్ చరణ్  ఒక సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయానే వార్త నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. సో ఎలా చూసుకున్న సుకుమార్ దృష్టి మొత్తం ఆర్సి 17 మీదే ఉంది. ఒకవేళ షారుఖ్ ఖాన్ ఆసక్తి చూపించినా ఇంకో రెండేళ్ల తర్వాత సాధ్యం కావొచ్చు. ఎందుకంటే అతను కూడా భారీ బడ్జెట్ మూవీ కింగ్ మీద బోలెడు డబ్బు, సమయం పెట్టుబడిగా పెడుతున్నారు.

సో షారుఖ్ విత్ సుకుమార్ ప్రస్తుతానికి ఊహాగానం మాత్రమే. ఇది ఎందుకు పుట్టినదంటే మైత్రి ఇటీవలే సన్నీ డియోల్ తో జాట్ రూపంలో మంచి హిట్టు కొట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు వాసనలు నింపినా నార్త్ ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. తనకే అలా ఉంటే ఇక పుష్ప సృష్టికర్త షారుఖ్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుందనేది హిందీ మీడియా ఎలివేషన్. వినడానికి బాగానే ఉంది కానీ సుకుమార్ ఫోకస్ ప్రస్తుతానికి బాలీవుడ్ వైపు లేదు. రంగస్థలం కాంబో కనక రామ్ చరణ్ కు అంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన టార్గెట్ సుకుమార్ భుజాల మీద ఉంది.