విడుదల తేదీల విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. జూన్ 12 నుంచి హరిహర వీరమల్లు తప్పుకున్నాక కొత్త డేట్ వేయడానికి నిర్మాత ఏఏం రత్నం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. సిజి పూర్తయిన ఫైనల్ కాపీ వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయిపోవడంతో మిగిలిన నిర్మాతలు అయోమయంలో పడ్డారు. జూన్ 20 కుబేర, 27 కన్నప్ప వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ జూలై 4. ఆ తేదీకీ పవన్ కళ్యాణ్ రావడం అనుమానమేనని సన్నిహిత వర్గాల సమాచారం. ముందు అనౌన్స్ చేసిన ప్రకారం చూసుకుంటే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఆ తేదీకి రావాలి. ఇంకో 26 రోజులు మాత్రమే ఉంది.
ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు. సితార సంస్థకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టులు పెడుతున్నారు కానీ పబ్లిసిటీ ఇంకా వేగం పెంచాలి. ఇప్పటిదాకా వచ్చినవి ఒక టీజర్, పాట మాత్రమే. లిరికల్ వీడియోలు, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్యాన్ ఇండియా ప్రమోషన్లు అన్నీ పెండింగ్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ కావడంతో టీమ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. అసలు ఛాలెంజ్ ఇది కాదు. అనిరుద్ రవిచందర్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇటీవలే చెన్నైకి వెళ్లి దీనికి సంబంధించిన కాల్ షీట్ల గురించి మాట్లాడి వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్.
సో అనుకున్న ప్రకారం అన్ని కొలిక్కి వస్తే జూలై 4 కింగ్ డమ్ రావడంలో అనుమానం లేదు. ఒకవేళ వచ్చే సూచనలు తగ్గిపోతే మాత్రం ఆ ఛాన్స్ వాడుకునేందుకు నితిన్ తమ్ముడు ఎదురు చూస్తోంది. ముందైతే జూలై 24 అనుకున్నారు కానీ మొదటి వారం స్లాట్ ఖాళీ అయితే దాన్ని వాడుకోవాలనే దిశగా నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే తమ్ముడుకి సంబంధించిన పనులు ఎక్కువ బ్యాలన్స్ లేవు. అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. సో కింగ్ డమ్ మిస్సైన పక్షంలో వెంటనే దాన్ని అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉండాలనే స్ట్రాటజీతో ఉందట. చూడాలి మరి జూలై 4 ఎవరి చేతికి చిక్కుతుందో.