రాజేంద్ర ప్రసాద్ కావాలని అనలేదు-ఆలీ

సీనియర్ నటుడు ఇటీవల రెండుసార్లు స్టేజ్ మీద అదుపు తప్పి మాట్లాడడం చర్చనీయాంశం అయింది. ‘రాబిన్ హుడ్’ ఈవెంట్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి అన్న మాట మీద జరిగిన రభస చాలదని.. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి అన్న బూతు మాట తీవ్ర వివాదాస్పదమైంది.

తనపై విమర్శల దాడి నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ స్పందించారు. తాను సరదాగా అన్న మాటను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ అని తేల్చేశారు. ఇదే సమయంలో మాట పడ్డ ఆలీ సైతం ఈ వివాదంపై స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఆ మాట అన్నారని.. దీన్ని వివాదం చేయొద్దని ఆలీ కోరారు. రాజేంద్ర ప్రసాద్ కూతురిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న విషయాన్ని ఆలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టిన రోజు వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారి నోటి నుంచి అనుకోకుండా ఆ మాట దొర్లింది. సరదాగా. కానీ ఏంటంటే.. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్టు. ఆయన పుట్టెడు దు:ఖంలో ఉన్నారు. ఇటీవల కాలంలో కూతురు పోయింది. అమ్మ లాంటి బిడ్డ. కావాలని అన్నది కాదు. దీన్ని ఎవరూ కూడా రభస చేయకండి. ఆయన పెద్దాయన. నమస్కారం” అని ఆలీ వ్యాఖ్యానించాడు.

రాజేంద్ర ప్రసాద్ మీద వయసు ప్రభావం, అలాగే కూతురి మరణం తాలూకు ఎఫెక్ట్ గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను సమర్థించకపోయినా.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కోరుతున్నారు.