కొద్దిరోజుల క్రితం జరిగిన దగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నడ భాషను ఉద్దేశించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వివాదం అంత సులభంగా చల్లారేలా లేదు. తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ నటుడు శివరాజ్ కుమార్ ని ఉద్దేశించి ఆయన అన్న మాటలు తీవ్ర నిరసనలకు దారి తీశాయి. తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ లోక నాయకుడు నుంచి బహిరంగ క్షమాపణ రాకపోతే తమ రాష్ట్రంలో సినిమాను బ్యాన్ చేస్తామని పిలుపునివ్వడం ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యే కమల్ కామెంట్స్ ని తప్పుబట్టడంతో ఇక అన్ని దారులు మూసుకుపోయినట్టే. అసలు ట్విస్టు ఇక ముందుంది.
కమల్ సారీ చెప్పడం మినహా మరో మార్గం లేదు. ఎందుకంటే దగ్ లైఫ్ కు కర్ణాటక వసూళ్లు చాలా కీలకం. ముఖ్యంగా బెంగళూరులో తమిళ వెర్షన్ కు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే మంచి రన్ దక్కుతుంది. ఎంతలేదన్నా పది కోట్లకు పైగానే వర్కౌట్ చేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అయితే అంతకు రెట్టింపు వచ్చినా ఆశ్చర్యం లేదు. నిజానికి కమల్ ఈ కాంట్రావర్సిని చల్లార్చే ప్రయత్నం మొన్నే చేశారు. తనకు, రాజకీయ నాయకులకు బాష గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఇష్యూని పెద్దది కాకుండా చూశారు. శివరాజ్ కుమార్ వేరే ఈవెంట్ లో కమల్ ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చాలా బలంగా చేశారు.
కానీ ఇవేవి పని చేయడం లేదు. ఆరు నూరైనా కమల్ క్షమాపణ చెప్పక తప్పదన్నది కన్నడ సంఘాల డిమాండ్. ప్రమోషన్లలో బిజీగా ఉన్న కమల్ దానికి సిద్ధపడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీన్ని ఇంకా సాగదీస్తే ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడతారు. రన్ దెబ్బ తింటుంది. పైగా భవిష్యత్తులో ఇది మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. తమిళం నుంచి కన్నడ పుట్టిందా లేదా అన్నది చరిత్రకారులు చెప్పాల్సిన మాట. దాన్ని ఒక నటుడిగా కమల్ హాసన్ చెప్పడం ఇంత రచ్చకు దారి తీసింది. మరి దగ్ లైఫ్ వివాదం రెండక్షరాల సారీతో ముగిసిపోతుందో లేదో చూడాలి. వచ్చే వారం జూన్ 5 ఈ సినిమా రిలీజ్ కానుంది.