టాలీవుడ్ బాక్సాఫీస్ కు మరో కీలకమైన శుక్రవారం వచ్చేసింది. రేపు భైరవం థియేటర్లలో అడుగు పెట్టనుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురికి ఇది కంబ్యాక్ ఇవ్వాల్సిన మూవీ కావడం విశేషం. ప్రమోషన్లు ఎడతెరిపి లేకుండా చేస్తున్నారు. టీవీ, యుట్యూబ్, రియాలిటీ షోలు ఎక్కడ చూసినా టీమ్ సభ్యులే కనిపిస్తున్నారు. హీరోయిన్ అదితి శంకర్ తో పాటు ముగ్గురు హీరోలు నాన్ స్టాప్ పబ్లిసిటీలో భాగమయ్యారు. తమిళ గరుడన్ రీమేక్ అయినప్పటికీ సరికొత్త ట్రీట్ మెంట్ తో కొత్త తరహా సినిమా ఇచ్చామని టీమ్ నమ్మకంతో చెబుతోంది. ఎంత మేరకు నిజమో రేపు తేలనుంది.
ఇంత చక్కగా ప్రమోషన్లు జరుగుతున్నప్పటికీ భైరవంకు ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. దీనికి ప్రధాన కారణం ఖలేజా రీ రిలీజ్. మహేష్ బాబు అభిమానులు దాని హ్యాంగోవర్ లో రికార్డులు బద్దలయ్యే స్థాయిలో టికెట్లు కొంటున్నారు. మరోవైపు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ కల్ట్ మూవీని ఒకసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో మొదటి రోజే చూసేందుకు ఎగబడుతున్నారు. దీని వల్ల ఖలేజా గత మూడు నాలుగు రోజులుగా ట్రెండింగ్ లో ఉంటోంది కానీ భైరవం మాత్రం ఎదురీదుతోంది. దీనికే ఇలా ఉంటే బరిలో ఉన్న మరో సినిమా షష్ఠిపూర్తి గురించి చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు భైరవంకు యునానిమస్ టాక్ రావాలి. క్రమంగా అది పెరుగుతూ పోతే సాయంత్రానికి ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. అసలే థియేటర్లకు ఫీడింగ్ లేక రెండు వారాల నుంచి అలో లక్ష్మణా అంటున్నాయి. ముఖ్యంగా బిసి సెంటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మల్టీప్లెక్సులు ఏదో హిందీ ఇంగ్లీష్ సినిమాలతో బండి లాగిస్తున్నాయి కానీ కింది కేంద్రాల్లో కనీసం అద్దెలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో జనాన్ని తీసుకొచ్చే బాధ్యతని ఖలేజా కన్నా ఎక్కువగా భైరవమే తీసుకోవాలి. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాలో మాస్ ని ఊపేసే నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అంటున్నారు.