రావిపూడి దూకుడుకి చిరంజీవి బ్రేకు

ప్రమోషన్లలో తనకెవరూ సాటిరారనే రీతిలో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మెగా 157 విషయంలో అంతకంటే ఎక్కువ స్పీడ్ చూపిస్తున్నాడు. నయనతారతో ఇంట్రో ప్రోమో షూట్ చేయించి తమిళ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన ఈ యంగ్ డైరెక్టర్, ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైందనే దానికి సూచనగా చిరు కళ్ళమీద క్లాప్ కొట్టిన చిన్న క్లిప్ వదలడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. అయితే అనిల్ దూకుడుకి చిరు బ్రేక్ వేశారనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది. ఇక్కడితో అప్డేట్స్ ఆపేయమని, ఓ రెండు షెడ్యూల్స్ అయ్యాక అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోమని మెగా స్టార్ సూచించారట.

దీనికి కారణం లేకపోలేదు. మెగా 157 పుణ్యమాని రిలీజ్ కు రెడీగా ఉన్న విశ్వంభర మీద ఫ్యాన్స్ ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. టీజర్ తర్వాత మెగా ఫాంటసీ మూవీ నుంచి ఎలాంటి పబ్లిసిటీ మెటీరియల్ బయటికి రాలేదు. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఏదో బుక్ లాంచ్ చేసి ఫోటోలు పంచుకున్నారు కానీ ఆ పుస్తకంలో ఉన్న రహస్యమేంటో చెప్పలేదు. ఆ మధ్య వచ్చిన రామ రామ లిరికల్ సాంగ్ కు వ్యూస్ అయితే భారీగా ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో ఆశించినంత రీచ్ తెచ్చుకోని మాట వాస్తవం. అందుకే వేగం పెంచమని మెగా ఫ్యాన్స్ క్రమం తప్పకుండా డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

ఇంకోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి రెండు రిలీజ్ డేట్లు వచ్చేశాయి. విశ్వంభర మాత్రం అదిగో ఇదిగో అంటూ ఊరించడం తప్ప ఎలాంటి న్యూస్ వదలడం లేదు. ఇంకో స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉందనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడది ఉంటుందో లేదోననే అనుమానం ఫ్యాన్స్ లో తలెత్తుతోంది. దర్శకుడు వశిష్ఠ సైతం ఏం చెప్పడం లేదు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ విజువల్ గ్రాండియర్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఆషికా రంగనాథ్ లాంటి గ్లామర్ కోటింగ్ బాగానే దట్టించారు. జూలై 24 విడుదలవ్వొచ్చనే ప్రచారం ఏ మేరకు నిజమవుతుందో వేచి చూడాలి.