‘మంచు’ గొడవలో తమ్మారెడ్డి రాయబారం

టాలీవుడ్లో ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబాల్లో ఒకటిగా ‘మంచు’ ఫ్యామిలీకి పేరుండేది. కానీ గత కొన్ని నెలల్లో ఆ పేరు బాగా చెడిపోయింది. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. పరస్పరం కేసులు పెట్టుకోవడం.. తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. ఇలా గొడవ చాలా దూరం వెళ్లిపోయింది. ఎంతకీ ఈ వివాదం సమసిపోవట్లేదు. దీనికి వీలైనంత త్వరగా తెరపడాలని మంచు ఫ్యామిలీ అభిమానులే కాక అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ తగువు తీర్చేదెవరన్నదే అర్థం కావడం లేదు.

ఐతే ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంలో ఇప్పుడు చొరవ తీసుకుంటున్నారు. ‘కన్నప్ప’ సినిమా తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తాను రాయబారం నడపడానికి రెడీ అయ్యారు.

‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు తమ్మారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ గొడవ గురించి ఆయన ప్రస్తావించారు. గొడవలు జరిగిన కొన్ని రోజులకే తమ్మారెడ్డి.. మంచు విష్ణుకు ఫోన్ చేసి ఇదంతా ఏంటి.. ఏం జరుగుతోందసలు అని అడిగారట.

మంచు కుటుంబంలో గొడవలు చూస్తుంటే తనకెంతో బాధగా అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ‘కన్నప్ప’ రిలీజ్ తర్వాత అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని.. కావాలంటే ఈ విషయంలో పెద్దరికం తీసుకోవడానికి సిద్ధమని చెప్పారు. ఈ మాటకు విష్ణు కూడా సరే అన్నాడు. తమ్మారెడ్డి సలహాలు తీసుకుంటానని.. ఆయన మాటలను ఫాలో అవుతానని చెప్పాడు. మరి తమ్మారెడ్డి అన్నట్లు ‘కన్నప్ప’ రిలీజయ్యాక మంచు కుటుంబం కలిసి కూర్చుని మాట్లాడుకుని వివాదాలకు తెరదించుతుందేమో చూద్దాం.