అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అంటూ మహాకవి ఆత్రేయ ఊరికే అనలేదు. నిన్న జరిగిన దగ్ లైఫ్ ప్రెస్ మీట్ లో తనికెళ్ళ భరణి అలాంటి సంఘటన ఒకటి పంచుకున్నారు. శివ నుంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న భరణికి 1991లో దళపతి రూపంలో అవకాశం తలుపు తట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ లుక్ టెస్ట్, ఆడిషన్ చేశాక వయసు సరిపోదని భావించి భరణిని వెనక్కు పంపేశారు. దీంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. మళ్ళీ అవకాశం రాకపోదాని ఎదురు చూశారు కానీ అది దశాబ్దాల పాటు కలగానే ఉండిపోయింది.
కట్ చేస్తే ముప్పై సంవత్సరాల తర్వాత పొన్నియిన్ సెల్వన్ తెలుగు స్క్రిప్ట్ కు పని చేసే అవకాశం దొరికింది. ఇదే అదునుగా భావించిన తనికెళ్ళ భరణి తనకు తరువాతి సినిమాలో కనీసం ఒక్క షాట్లో కనిపించే ఛాన్స్ ఉన్నా ఇమ్మని అడిగారు. నవ్వి ఊరుకున్న మణిరత్నం సమాధానం ఇవ్వలేదు. తర్వాత దగ్ లైఫ్ లో క్యారెక్టర్ ఉందంటూ పిలుపు వచ్చింది. ఏదైనా ఒక్క సీన్ చాలనుకుంటే ఏకంగా మంచి నిడివి ఉన్న పాత్ర ఇచ్చారు. దీంతో సుదీర్ఘంగా కన్న కల ఈ విధంగా నిజమయ్యింది. దళపతి పేరు తనికెళ్ళ భరణి ప్రస్తావించలేదు కానీ రజని మణిరత్నం కాంబోలో వచ్చిన సినిమా అదొక్కటే కాబట్టి ఈజీగా గెస్ చేయొచ్చు.
ఈ రకంగా దగ్ లైఫ్ చాలా ప్రత్యేకతలు మోసుకొస్తోంది. జూన్ 5 విడుదల దగ్గర ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచారు. నాయకుడు కంటే గొప్పగా వచ్చిందని కమల్ హాసన్ చెబుతున్న మాటలు అంచనాలు పెంచేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, త్రిష అభిరామి గ్లామర్, శింబు పాత్ర, మాఫియా బ్యాక్ డ్రాప్, భారీ తారాగణం వగైరాలు ఆసక్తి రేపుతున్నాయి. విక్రమ్ తర్వాత ఇండియన్ 2 రూపంలో పెద్ద షాక్ తిన్న కమల్ ఇప్పుడీ దగ్ లైఫ్ తో కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. తెలుగులో బజ్ తక్కువగా కనిపిస్తోంది కానీ రిలీజ్ నాటికి అంచనాల్లో భారీ మార్పులు వచ్చే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.