యావత్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సింగల్ స్క్రీన్ల బంద్ ఇష్యూ ఇంకా కొలిక్కి రాలేదని తెలిసింది. ఇవాళ జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో అద్దెలు, పర్సెంటెజ్ ల గురించి జరిగిన వాడివేడి చర్చలో పలురకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. మల్టీప్లెక్సుల తరహాలో సింగల్ థియేటర్లకు పర్సెంటెజ్ అమలు చేయడంలో అభ్యంతరం లేదని, కానీ చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేకుండా, పాత వసతులతో నడపటం వల్ల ఆడియన్స్ రావడం తగ్గిపోయిందని, ముందు దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎగ్జిబిటర్ల మీద ఉందనే కోణంలో కొందరు బలమైన వాదన వినిపించారని తెలిసింది.
అగ్ర నిర్మాతలందరూ దాదాపుగా పాల్గొన్న ఈ మీటింగ్లో ఆర్గుమెంట్లు బాగానే జరిగాయని వినికిడి. రెంటల్ పద్ధతిలో ఉన్న తప్పొప్పులతో పాటు పర్సెంటెజ్ సిస్టం తేవడం వల్ల ఒరిగే లాభ నష్టాల గురించి డిస్కషన్ వాడివేడిగా జరిగిందని అంటున్నారు. ఎల్లుండి మరోసారి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిసి ప్రొడ్యూసర్లు మరో సమావేశం ఏర్పాటు చేస్తారని, అక్కడ తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిసింది. జూన్ లో చాలా పెద్ద రిలీజులు క్యూ కట్టాయి. దగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప లాంటి క్రేజీ మూవీస్ వరసబెట్టి వస్తున్నాయి. వీటి మీద మొత్తం కలిపి వందల కోట్లకు పైగా పెట్టుబడులున్నాయి.
ఈ కారణంగానే వీలైనంత సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు నడుం బిగించారని వినికిడి. జూన్ 1 థియేటర్స్ బంద్ ఉండకపోవచ్చని వినిపిస్తోంది కానీ ప్రస్తుతానికి మాత్రం క్యాన్సిల్ కాలేదు. ఇప్పటికే రెండు మూడు నెలల నుంచి మూడు నాలుగు హిట్లు తప్ప టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉంది. శ్రీవిష్ణు సింగిల్ తప్ప మేలో ప్రభావం చూపించినవి పెద్దగా లేవు. కొన్ని రీ రిలీజులు అద్దెల కిట్టుబాటుకి తోడ్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో సింగల్ స్క్రీన్లు మూసేస్తే నష్టం ఒక్కరికే పరిమితం కాదు. ఇండస్ట్రీ మొత్తానికి వర్తిస్తుంది. సో ఈ వీకెండ్ లోగా సానుకూల నిర్ణయం వస్తుందని అంటున్నారు. చూద్దాం.