‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసేది అల్లు అర్జున్ సినిమానే అని అంతా అనుకున్నారు. కెరీర్లో తొలిసారిగా ఒక భారీ ఈవెంట్ ఫిలిం, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకున్నాడు. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటి అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించకుండా అట్లీ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. అలా అని త్రివిక్రమ్ సినిమా ఆగిపోయినట్లేమీ కాదు. అట్లీ సినిమా తర్వాత బన్నీ కచ్చితంగా ఈ సినిమా చేస్తాడనే అంటున్నారు.
ఈ లోపు త్రివిక్రమ్ తక్కువ టైంలో ఒక సినిమా చేసేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న విక్టరీ వెంకటేష్ సినిమాను త్రివిక్రమ్ టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ రచనలో వెంకీ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి ఎంతగా ప్రేక్షకులను అలరించాయో తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ వెంకీ నటించడానికి అమితాసక్తి చూపించాడు కానీ.. చర్చల దశను దాటి ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఐతే ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకీ.. తర్వాత ఏ కొత్త సినిమాను మొదలుపెట్టలేదు. వేరే ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ.. త్రివిక్రమ్ అందుబాటులోకి రావడంతో ఆ సినిమానే చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. వీరి కలయికలో సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆశిస్తున్నారు. ఐతే దీనికే ఎగ్జైట్ అవుతుంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తాడనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఈ కాంబో వర్కవుట్ అయితే అదిరిపోతుంది. కానీ ఓవైపు ‘పెద్ది’తో ఫుల్ బిజీగా ఉంటూ.. ఇంకోవైపు సుకుమార్ సినిమాను కూడా చేయాల్సిన చరణ్.. మధ్యలో ఖాళీ చేసుకుని త్రివిక్రమ్-వెంకీ సినిమాలో నటిస్తాడా అన్నది ప్రశ్న. త్రివిక్రమ్‌తో చేస్తే హీరోగానే చేయాలి కానీ.. ఇలా స్పెషల్ రోల్స్ చేయడం ఏంటి అని చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఫీలయ్యే ఛాన్సు కూడా ఉంది. మరి ఈ రూమర్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఐతే ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు.. అసలు త్రివిక్రమ్-వెంకీ కలిసి సినిమా చేస్తారన్నదే ఇంకా కన్ఫమ్ కానపుడు చరణ్ అతిథి పాత్ర చేయడం గురించి ఇంత చర్చ ఎందుకు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.