దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎంత ఊపు ఉంటుందో.. స్టేజ్ ఎక్కి అతను మాట్లాడుతుంటే అంతే ఉత్సాహం ఉంటుంది. సినిమా ఈవెంట్లలో అందరిలా అవతలి వాళ్ల భజన చేయకుండా ఆసక్తికర విషయాలు మాట్లాడుతుంటాడతను. కొన్నిసార్లు గట్టిగా కౌంటర్లు కూడా వేస్తుంటాడు. ‘పుష్ప-2’ ప్రమోషనల్ ఈవెంట్లో అతడి వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. తానుండగా.. వేరే సంగీత దర్శకులతో కొన్ని సీన్లకు సుకుమార్ నేపథ్య సంగీతం చేయించుకోవడంతో దేవిశ్రీ ఫైర్ అయిపోయాడు. సుక్కును ఏమీ అనకుండా నిర్మాతలను టార్గెట్ చేశాడు.
దీని వల్ల సుకుమార్‌తో అతడికి చెడుతుందా.. తర్వాతి సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి పని చేయరా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ తర్వాత అంతా సర్దుకున్నట్లే కనిపించింది. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఒక సినిమా ఈవెంట్లో.. సుకుమార్ అని కాకుండా దర్శకులందరి మీద ప్రశంసలు కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ‘జూనియర్’ సినిమాకు దేవినే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ లాంచ్ బెంగళూరులో జరిగింది. ఈ వేడుకలో దేవి దర్శకులను ఆకాశానికెత్తేశాడు.
‘‘ఒక సినిమా చేయాలంటే దర్శకుడే అత్యంత కీలకం. నటీనటులను ఎంచుకుని, నిర్మాతను ఒప్పించి.. టెక్నీషియన్లను సెట్ చేసుకుని తొలి రోజు నుంచి రిలీజ్ వరకు కష్టపడేది దర్శకుడే. ప్రతి దర్శకుడికీ మనం ప్రేమ, గౌరవం ఇవ్వాలి. కొత్త దర్శకుడైనా సరే, పెద్ద దర్శకుడైనా సరే.. ఫెయిల్యూర్ వస్తే దర్శకుడినే మనం ముందుగా నిందిస్తాం. అలాగే ఏ కష్టం వచ్చినా ముందు దర్శకుడే పడాలి. దర్శకుల కష్టం వల్లే మనందరం ఇక్కడ ఉన్నాం. ఒక దర్శకుడు కథను క్రియేట్ చేసి అందరినీ ఒప్పించి ట్రాక్‌లో పెడితే తప్ప.. మనందరం ఎంత టాలెంట్ ఉన్నా సరే పీకేదేం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి. మీ కెమెరాలో మీరు చూసుకోవాలి. అందమైన కథలు చెబుతూ మన జీవితాలను ఇంకా అందంగా మారుస్తున్న దర్శకులందరికీ హ్యాట్సాఫ్’’ అని దేవి అన్నాడు.