నయనతారను ఎలా ఒప్పించావయ్యా

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే వేరు. ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చినప్పటి నుంచి తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని అందుకు అనుగుణంగానే పని చేసుకుంటూ వెళ్తోంది. తాను సినిమా ప్రమోషన్లకు రానని ఆమె ఖరాఖండిగా చెప్పేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే.. తన అవసరం ఎంతున్నా సరే.. ఈ విషయంలో రాజీ పడదు. తెలుగులో ‘సైరా’ సహా ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన నయన్.. ఒకట్రెండు చిత్రాలను మించి ప్రమోట్ చేయలేదు. ‘శ్రీరామరాజ్యం’ తన సినిమా చివరి సినిమా అవుతుందన్న అంచనాతో ఆ చిత్ర ఆడియో వేడుకకు మాత్రమే హాజరైంది.

తమిళంలో తన మనసుకు బాగా దగ్గరైన, తాను ప్రొడక్షన్లో భాగమైన కొన్ని సినిమాలను మాత్రమే ప్రమోట్ చేసింది.
అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఓ సినిమా మొదలు కాకముందే.. దాని ప్రమోషన్‌లో భాగం కావడం అందరికీ పెద్ద షాకే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించనున్న చిత్రంలో నయన్ కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని నయన్ భాగమైన ఒక ఫన్నీ ప్రమోషనల్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

ఇందులో నయన్ తెలుగులో మాట్లాడ్డం.. మెగాస్టార్‌తో కలిసి నటించడం పట్ల ఎగ్జైట్ కావడం.. అనిల్ స్క్రిప్టును పొగడ్డం.. ఇలా ప్రతిదీ ఆశ్చర్యకరమే. సినిమా రిలీజ్ టైంలో కూడా ప్రమోషన్లకు రాని నయన్‌తో అనౌన్స్‌మెంట్‌తోనే ఇలాంటి వీడియో చేయించడం అనిల్ రావిపూడికే చెల్లింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్ల విషయంలో ట్రెండ్ సెట్ చేసిన అనిల్.. ఇప్పుడు మెగాస్టార్ మూవీని ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. అసలు నయన్‌ను ఇలా ఎలా ఒప్పించాడని ఇండస్ట్రీ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.