టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇతర బాషల సంగతేమో కానీ ఒరిజినల్ వెర్షన్ కు బ్లాక్ బస్టర్ వసూళ్లు దక్కాయి. అయితే మైత్రికు రజనీకాంత్ తో సినిమా చేయాలనే టార్గెట్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన సానుకూలంగానే ఉన్నారట కానీ సరైన కథ, దర్శకుడు దొరక్క పెండింగ్ లో ఉంచుతూ వచ్చారు. డాకు మహారాజ్ కన్నా ముందు బాబీతో ఒక స్టోరీ చెప్పించినా పనవ్వలేదని చెన్నై టాక్. తమ బ్యానర్ లో పని చేసిన ఇంకో ఇద్దరు డైరెక్టర్లతో నెరేషన్లు ఇప్పించినా ఫలితం దక్కలేదు. చివరికివి కొలిక్కి వచ్చినట్టు టాక్.
దర్శకుడు వివేక్ ఆత్రేయ తలైవర్ ని మెప్పించడంలో సక్సెసయ్యాడనేది లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా జరిగిన చర్చల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందట. సరిపోదా శనివారంతో బిగ్ లీగ్ లోకి వచ్చేసిన వివేక్ ఆత్రేయ తాను సాఫ్ట్ ఎమోషనల్ సబ్జెక్టులే కాకుండా మాస్ ని కూడా బాగా హ్యాండిల్ చేయగలనని నానితో నిరూపించాడు. అంటే సుందరానికి వచ్చిన కామెంట్స్ అన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోయేలా చేశాడు. ఇప్పుడో సరైన కమర్షియల్ కథతో రజినికి చెప్పిన విధానం వర్కౌట్ అయ్యేలా ఉందని చెన్నై వర్గాలు కాస్తంత గట్టిగానే ఉటంకిస్తున్నాయి.
రజినీకాంత్ ప్రస్తుతం కూలి, జైలర్ 2తో బిజీ ఉన్నారు. మొదటిది షూటింగ్ అయిపోగా రెండోది ముప్పై శాతం పైగా పూర్తి చేసుకుంది. వీటి తర్వాత రజని ఎవరికీ ఎస్ చెప్పలేదు. ఒకవేళ వివేక్ ఆత్రేయది నిజంగా ఓకే అయితే మాత్రం ఇతనికి అంతకన్నా జాక్ పాట్ ఇంకేముంటుంది. తెలుగు దర్శకులతో రజనీకాంత్ పని చేసి చాలా కాలమయ్యింది. ఎందరు వెళ్లి కలిసినా కన్విన్స్ చేయలేకపోయారు. మరి వివేక్ ఆత్రేయ అంత పవర్ ఫుల్ సబ్జెక్టు ఎలాంటిది రాసుకున్నాడో చూడాలి. ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే చెలామణి అవుతోంది కానీ నిప్పు లేనిదే పొగరాని ఇండస్ట్రీ వాతావరణంలో ఏ నిమిషంలో ఎలాంటి సెన్సేషన్ అయినా జరగొచ్చు.