కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25 కానుందని లేటెస్ట్ అప్డేట్. నిర్మాత దిల్ రాజు బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో రిలీజ్ డేట్ల వ్యవహారం అస్తవ్యస్తంగా మారడం చూస్తున్నాం. దాదాపుగా పెద్ద సినిమాలన్నీ ముందు అనౌన్స్ చేసుకున్నట్టు రాలేకపోయాయి. ఏదో ఒక కారణంతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కింగ్ డం సైతం మార్చి నుంచి జూన్, మళ్ళీ అటు నుంచి జూలైకి వచ్చిన బాపతే. శివరాత్రిని అనుకున్న తమ్ముడు మూడు నెలలు ఆలస్యంగా రావడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
నిజానికి తమ్ముడుకి జరిగింది మేలే అనుకోవాలి. ఎందుకంటే జూలై చివరిలో రావాలనుకున్న రవితేజ మాస్ జాతర, చిరంజీవి విశ్వంభర రెండూ తప్పుకునే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. మాస్ జాతర నిర్మించింది కింగ్ డమ్ ప్రొడ్యూస్ చేసిన సితారే కాబట్టి మాస్ రాజా రాడనే స్పష్టమైన సమాచారంతోనే దిల్ రాజు జూలై 25 ఎంచుకున్నట్టు టాక్. ఇంకోవైపు విశ్వంభర గురించి క్లారిటీ లేకపోవడంతో పాటు యువి సంస్థ ఇప్పుడప్పుడే మెగా మూవీని రిలీజ్ చేయలేమనే దిశగా సంకేతాలు ఇవ్వడంతో తమ్ముడుకి రూట్ క్లియరయ్యింది. పాజిటివ్ టాక్ వస్తే చాలు నితిన్ ఎదురు చూస్తున్న సక్సెస్ చేతికి వచ్చినట్టే.
తమ్ముడు దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేశాక చాలా గ్యాప్ తీసుకున్నాడు. అల్లు అర్జున్ తో ఐకాన్ అనుకున్నాడు కానీ పనవ్వలేదు. దిల్ రాజు మరో సినిమా ఇస్తాననే కమిట్ మెంట్ నిలబెట్టుకుంటూ తమ్ముడుకి ఎస్ చెప్పాడు. సీనియర్ హీరోయిన్ లయ చాలా గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న మూవీ ఇది. నితిన్ అక్కయ్యగా ఆమె పాత్ర చాలా కీలకం కానుంది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. రాబిన్ హుడ్ తీవ్రంగా నిరాశపరచడంతో నితిన్ ఆశలన్నీ తమ్ముడు మీదే ఉన్నాయి. తనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకున్నాడు. ఫలితం కూడా అలాగే వస్తే హ్యాపీస్.