మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా అఫీషియల్ ముద్ర కాస్త ఆలస్యంగా వేశారు. కొత్త డేట్ జూలై 4గా నిర్ణయించారు. ఇదే స్లాట్ ని కొద్దిరోజుల క్రితం నితిన్ తమ్ముడు కోసం నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఎస్విసి కనక సానుకూల నిర్ణయం తీసుకుంటే తమ్ముడు మరోసారి డేట్ మార్చుకోక తప్పదు. అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాతే ఈ డెషిషన్ తీసుకుని ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. కాకపోతే తమ్ముడు ఉంటాడా తప్పుకుంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
సో ముందు అనుకున్న ప్రకారమైతే 35 రోజులు ఆలస్యంగా కింగ్ డమ్ వస్తోంది. ఇప్పుడు తగినంత సమయం దొరకడంతో రీ రికార్డింగ్, ప్యాన్ ఇండియా ప్రమోషన్లను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాని శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయని మాట వాస్తవం. తమిళంలో మణిరత్నం లాంటి దర్శకులు అమృత రూపంలో స్పృశించారు కానీ మన దగ్గర పెద్దగా లేవు. అందుకే కింగ్ డమ్ కంటెంట్ పరంగా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే ధీమా సదరు టీమ్ లో కనిపిస్తోంది.
జూన్ లో తగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేర, కన్నప్ప, సితారే జమీన్ పర్ లతో నిండిపోయింది కానీ కింగ్ డం జూలైకి వెళ్లిపోవడం మంచి నిర్ణయం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది. బీజీఎమ్ కోసం ఇప్పుడు ఒత్తిడి లేదు కాబట్టి అనిరుద్ నుంచి బెస్ట్ ఆశించవచ్చు. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న కింగ్ డమ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళంలో పెద్ద ఎత్తున థియేటర్ రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ ఆఫర్లు క్రేజీగా వస్తున్నాయట.