భయానక సినిమాకు అర్ధరాత్రి ప్రీమియర్లు

చావు మీద వచ్చిన అత్యంత భీతి గొలిపే సినిమాల్లో ఫైనల్ డెస్టినేషన్ ది ప్రత్యేక స్థానం. 2000 సంవత్సరంలో ఈ ఫ్రాంచైజ్ లోని తొలి చిత్రం వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఏదో ఒక వస్తువు లేదా మనిషి వల్ల ఊహించలేనంత దారుణంగా మనుషులు చనిపోతే ఎలా ఉంటుందో ఒళ్ళు జలదరించేలా చిత్రీకరించిన తీరు బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. కలలో వచ్చే సంఘటనలు కళ్ళ ముందే నిజమవుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిని చూపించిన తీరు ఆడియన్స్ ని విభ్రాంతికి గురి చేసింది. తర్వాత 2003, 2006, 2009, 2011లో వరుసగా మరో నాలుగు భాగాలు వచ్చి బ్లాక్ బస్టరయ్యాయి.

ఇప్పుడు పదిహేనేళ్ల తర్వాత ఫైనల్ డెస్టినేషన్ చివరి భాగం బ్లడ్ లైన్స్ పేరుతో ఈ వారం మే 15 విడుదల కానుంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేశారు. విశేషం ఇది కాదు. ఈ మూవీకి ఇండియాలో ముందు రోజు అర్ధరాత్రే స్పెషల్ ప్రీమియర్లు దేశమంతటా ప్రదర్శించబోతున్నారు. రాత్రి 11 గంటల 59 నిమిషాలకు తొలి షో పడనుంది. మాములుగా మన దేశంలో స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి బెనిఫిట్ షోలు వేస్తుంటారు. కానీ ఫైనల్ డెస్టినేషన్ కు ఇలా జరగడం విచిత్రమే. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ ఈ షోలు ఉండబోతున్నాయి.

చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇదో ప్రధాన ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు. బ్లడ్ లైన్స్ ట్రైలర్ చూస్తే ఈసారి హింస మోతాదు విపరీతంగా పెరిగినట్టు అనిపిస్తోంది. విజువల్స్ లో హత్యలను చూపించిన విధానం నిద్రలో సైతం వెంటాడేలా ఉంది. దీంతో ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కి ముగింపు పలకబోతున్నారు. తొలుత పుస్తకంగా ఫైనల్ డెస్టినేషన్ పది భాగాలుగా వచ్చింది. అన్నీ బెస్ట్ సెల్లర్సే. రెండు కామిక్ బుక్స్ వచ్చాయి. సినిమాని మాత్రం ఆరు భాగాలకు పరిమితం చేశారు. దీని డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం పాతికేళ్ల సిరీస్ కు అప్పుడే ముగింపు పలికేస్తారా అంటూ తెగ ఫీలవుతున్నారు. చూడాలి కంక్లూజన్ ఎలా ఉండబోతోందో.