క్రేజీ దర్శకుడు హీరో అయితే ఎలా

సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్ ది మొదటి పేరు. తీస్తున్నది తమిళ సినిమాలే అయినా తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇతని రేంజ్ ఎంతంటే నిన్న కూలి చిన్న టీజర్ వదిలితే అందులో నాగార్జున బ్యాక్ షాట్ గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకునేంత. పాత కథలనే తనదైన స్టైలిష్ టేకింగ్ తో మాస్ ఎలివేషన్లతో పైసా వసూల్ చేయించే ఈ కమర్షియల్ దిగ్గజం త్వరలో హీరో కాబోతున్నాడనే వార్త అభిమానులను ఖంగారు పెడుతోంది. చెన్నై టాక్ చూస్తే నిజమే అనిపిస్తోంది.

ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో హీరోగా లోకేష్ డెబ్యూ జరగనుందని లేటెస్ట్ అప్డేట్. నిజానికి దర్శకులు కథానాయకులుగా మారడం చాలాసార్లు జరిగింది. కానీ సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ. మంచి ఊపు మీదున్న టైంలో ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా కనిపించాలనే తాపత్రయంతో వరస ఫ్లాపులు చూసి కెరీర్ ని త్వరగా ముగించుకున్నారు. వివి వినాయక్ తో నిర్మాత దిల్ రాజు అలాంటి ప్రయత్నమే చేయబోయి ప్రకటన ఇచ్చాక మానుకున్నారు. గతంలో దాసరి, భాగ్యరాజ్, ఉపేంద్ర లాంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ చవిచూశారు. గౌతమ్ మీనన్. సెల్వ రాఘవన్ ఆర్టిస్టులుగా సెటిలయ్యారు.

అయినా వందల కోట్ల బడ్జెట్ లతో మల్టీస్టారర్లు తీస్తున్న టైంలో లోకేష్ కి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందోనని ఫాన్స్ ఫీలవుతున్నారు. అయినా తన ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. గతంలో శృతి హాసన్ తో కలిసి ఒక వీడియో సాంగ్ చేశాడు. కాకపోతే దానికి ఎక్కువ రీచ్ రాలేదు. లారెన్స్ హీరోగా రూపొందే మరో సినిమాలో ముఖ్యమైన పాత్ర చేస్తాడనే టాక్ వచ్చింది కానీ అది జరగలేదు. ఇప్పుడు మాత్రం అరుణ్ మాతేశ్వరన్ నువ్వే నటించాలని పట్టుబట్టడంతో లోకేష్ ఒప్పుకున్నట్టు తెలిసింది. జీవితంలో పది సినిమాలే తీస్తానని ఆ మధ్య యధాలాపంగా చెప్పిన లోకేష్ నిజంగానే యాక్టర్ గా మారిపోతే షాకే.