బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కొత్తగా వచ్చిన హీరోలకు పరిపక్వత, పరిణితి చాలా అవసరం. ఎక్కువ అవసరం లేదు కానీ క్రమంగా వాటిని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. మూవీ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు ఇర్ఫాన్ ఖాన్. తన విలక్షణమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులో మహేష్ బాబు సైనికుడులో విలన్ గా చేయడం టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తే. సినిమా పోయింది కానీ భాష రాకపోయినా నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. అనారోగ్యంతో కన్ను మూయకపోతే ఇర్ఫాన్ ఖాన్ మరిన్ని క్లాసిక్స్ లో ఖచ్చితంగా భాగమయ్యేవారు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే ఇర్ఫాన్ ఖాన్ వారసుడు బాబిల్ ఖాన్ బాలీవుడ్ కు పరిచయమయ్యే క్రమంలో ఉన్నాడు. ఖలా, రైల్వే మెన్, లాగ్ అవుట్ వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడే. బిగ్ స్క్రీన్ డెబ్యూ కోసం బేబీ హిందీ రీమేక్ లో నటిస్తాడనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవలే హఠాత్తుగా బాబిల్ ఖాన్ బాలీవుడ్ ని దుయ్యబడుతూ ఒక వీడియో చేసి వైరలయ్యాడు. తప్పు తెలుసుకుని గుర్తించి డిలీట్ చేసే లోపే మ్యాటర్ చాలా దూరం వెళ్లిపోయింది. ఇన్స్ టాలో దర్శకుడు సాయిరాజేష్ ఈ ధోరణిని తప్పు బడుతూ కామెంట్లు చేయడం, బాబిల్ దానికి ఘాటుగా సమాధానం ఇస్తూ కౌంటర్లు వేశాడు.
తర్వాత పరస్పరం ఇద్దరూ వాటిని డిలీట్ చేసుకున్నారు కానీ బాబిల్ ఖాన్ చూపిస్తున్న తొందరపాటు భవిష్యత్తులో చాలా చేటు చేయడం ఖాయం. ఇంకా కెరీర్ మొదలవ్వలేదు. తెరంగేట్రం అవ్వలేదు. ఇంతలోపే ఏదో కొంప మునిగిపోయినట్టు ఇంత ఆక్రోశం వెళ్లగక్కడం లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతోంది. తీవ్ర విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఒక స్థాయికి వచ్చాక ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కానీ తండ్రిని ఎంతో గౌరవించే పరిశ్రమ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అయినా కుర్రాడి అపరిపక్వత ఎక్కడికి దారి తీస్తుందో కానీ మొత్తానికి అవసరం లేని టాపిక్ గురించి అనవసరంగా హైలైట్ అయిపోయాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates