‘బ్యాడ్ ‌బాయ్’ శింబును మార్చేసిన మణిరత్నం

కోలీవుడ్లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు, దర్శకులతో గొడవలు.. ఇలా నెగెటివ్ రీజన్లతో అతడి పేరు మీడియాలో ఎన్నోసార్లు మార్మోగింది. షూటింగ్‌కు సరైన సమయానికి రాడని.. నిర్మాతలను ఏడిపిస్తాడని చాలాసార్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అతడిపై నిషేధం విధించాలని నిర్మాతల మండలికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఐతే ఇలాంటి ముద్ర ఉన్న శింబును.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం పూర్తిగా మార్చేశాడట. మణితో ఇంతకుముందు ‘నవాబ్’ సినిమా చేసిన శింబు.. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ కూడా చేశాడు.

ఈ రెండు చిత్రాలకూ చాలా పద్ధతిగా టైంకు వచ్చి షూటింగ్ చేయడమే కాక.. నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదట.
ఇదే విషయమై ‘థగ్ లైఫ్’ ప్రమోషనల్ ఈవెంట్లో ఒక విలేకరి ప్రశ్నించారు. మణిరత్నం సినిమాకు మాత్రం ఎలా గుడ్ బాయ్‌గా మారిపోయారు అని అడిగితే శింబు సమాధానం ఇచ్చాడు. ‘‘ఒక సినిమా చిత్రీకరణ సరిగ్గా ముందుకు వెళ్లడం దర్శకుడి చేతిలోనే ఉంటుంది. దర్శకుడు క్రమశిక్షణతో ఉంటే, టైంకి షూటింగ్‌కు వస్తే అందరూ ఆయన్ని అనుసరిస్తారు. దర్శకుడే బాధ్యతా రాహిత్యంగా ఉంటే.. అది అందరి మీదా ప్రభావం చూపుతుంది.

మణిరత్నం అంత పెద్ద దర్శకుడు అయినప్పటికీ.. అందరి కంటే ముందు షూటింగ్‌కు వస్తారు. అది చూసి నేను కూడా క్రమశిక్షణతో మెలిగాను. ఒక్క రోజు కూడా షూట్‌కు ఆలస్యంగా రాలేదు. ఇక చాలామంది దర్శకుల్లాగా సెట్‌కు వచ్చాక ఈ సీన్ ఎలా చేద్దాం అని ఆయన డిస్కస్ చేయరు. ఏం చేయాలో ముందే పూర్తి స్పష్టతతో వస్తారు. చిన్న కన్ఫ్యూజన్‌ కూడా ఉండదు. ఏదైనా మార్పు చేయాలన్నా.. ఏదైనా చెప్పాలన్నా మానిటర్ దగ్గర కూర్చుని అరవడం ఉండదు. మనం ఎంత దూరంలో ఉన్నా ఆయనే దగ్గరికి వచ్చి వివరిస్తారు. మణిరత్నం అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన లాంటి దర్శకులే నా కెరీర్లో ఉండి ఉంటే.. నేను మరిన్ని సినిమాలు చేసేవాడిని. అభిమానులను సంతోషపెట్టేవాడిని. మణి సార్ ఇంకా నాతో ఎన్ని సినిమాలు చేస్తానన్నా నేను సిద్ధం’’ అని శింబు తెలిపాడు.