ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ మెగా ఫ్యాన్స్, అల్లు అభిమానుల మధ్య తరచు ఆన్ లైన్ గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. డిజె ఈవెంట్లో చెప్పను బ్రదర్ తో మొదలైన ఈ రచ్చ పుష్ప 2ని టార్గెట్ చేసుకునే దాకా వచ్చింది. గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే బన్నీ ఎక్కడా చిరంజీవి ప్రస్తావన తేవడం లేదని, తనకు ఎవరి మద్దతు అవసరం లేదనే తరహాలో ప్రవర్తిస్తున్నాడని మెగా ఫ్యాన్స్ చేసే కామెంట్. అలాంటిదేమి లేదు, సందర్భం వచ్చినప్పుడు మావయ్య మీద ప్రేమను ఐకాన్ స్టార్ ప్రదర్శిస్తూనే ఉంటాడని ఇటువైపు నుంచి వచ్చే కౌంటర్. తాజాగా జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు బన్నీ.
స్టేజి మీద ఉన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు గొప్ప స్ఫూర్తి ఇచ్చిన వాళ్లలో మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకరని, ఆయన ప్రభావం నామీద చాలా బలంగా పని చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు సభికుల నుంచి చప్పట్లు వినిపించడం విశేషం. ఇప్పుడీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2కి సంబంధించి సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగినప్పుడు బన్నీ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరించి ఫోటో కూడా తీసుకొచ్చాడు. తర్వాత మళ్ళీ ఈ కలయిక జరగలేదు. ఇప్పుడు వేవ్స్ లో అల్లు అర్జున్ తానుగా చిరు గురించి గొప్పగా చెప్పడం గమనించాల్సిన విషయం.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోలు బంధుత్వం ఉన్నా లేకపోయినా అందరూ ఒకటే. పైకి ఫ్యాన్స్ ఏదో విభేదాల పేరుతో ఆన్ లైన్ వార్స్ చేసుకుంటారు కానీ అలాంటివి స్టార్ల మధ్య ఉండవు. మెగా అల్లు కుటుంబాలు కలిసి ఎన్నో పండగలు చేసుకున్నాయి. ఏదైనా వేడుక వస్తే అందరూ కలిసి ఫోటోలు దిగి భోజనాలు చేసుకుంటారు. కొన్ని నెలలు ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ వచ్చి ఉండొచ్చు మావయ్య అంటే బన్నీకున్న ప్రేమ, అల్లుడు అల్లు అర్జున్ అంటే మెగాస్టార్ కున్న అభిమానం ప్రతిసారి ప్రదర్శించేవి కావు. ఇదంతా ఓకే కానీ వీళ్లిద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ వస్తే ఎంత బాగుంటుందో కదా.
Gulte Telugu Telugu Political and Movie News Updates