ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ సిద్ధమవుతున్న తరుణంలో అందులో భాగమైన ఓ నటుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. సీజన్-3లో ఓ కీలక పాత్ర చేసిన రోహిత్ బస్ఫోర్ అస్సాంలోని ఒక జలపాతం దగ్గర విగతజీవిగా కనిపించాడు. ఈ నటుడి ఒంటిపై గాయాలుండడంతో అతణ్ని ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-3 నార్త్ ఈస్ట్ నేపథ్యంలోనే నడుస్తుంది. ఇక్కడి రాష్ట్రాల్లోనే ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. రోహిత్ బస్ఫోర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. తన పాత్ర చిత్రీకరణ అంతా కూడా పూర్తయింది. కాగా రోహిత్ తన సొంత నగరమైన ముంబయి నుంచి ‘ఫ్యామిలీ మ్యాన్-3’ షూట్ కోసమే కొన్ని నెలల కిందట గౌహతికి వచ్చాడు. చిత్రీకరణ పూర్తయ్యాక కూడా స్నేహితులతో కలిసి గౌహతిలోనే ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం నుంచి అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయింది.
రోహిత్ నుంచి ఒక రోజు గడిచినా ఫోన్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి గాలించగా ఓ జలపాతం దగ్గర రోహిత్ మృతదేహం కనిపించింది. ఇటీవల పార్కింగ్ విషయమై ముగ్గురు వ్యక్తులతో రోహిత్ గొడవ పడ్డాడని.. వారే అతణ్ని హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోహిత్ ముఖం, తల, ఇతర శరీర భాగాలపై గాయాలు కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో రోహిత్‌ది హత్యగానే భావిస్తున్నారు. కాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ నవంబరులో అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్‌కు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates