వరస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే సినిమా మీదే ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మే 15 రామ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో టీజర్ తో పాటు పేరుని ప్రకటించాలా వద్దానే మీమాంస కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరో అవసరం ఉందనేది ముందు నుంచి ప్రచారంలో ఉన్న లీక్. తొలుత మోహన్ లాల్ అనుకుని కథ కూడా వినిపించారట. ఆయన సానుకూలంగా స్పందించినట్టు టాక్ వచ్చింది. కానీ తర్వాత ఏవో కారణాల వల్ల లాలెట్టన్ బదులు ఉపేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ చేసినట్టు తెలిసింది. ఈ మధ్య తన పాత్రకు ప్రాధాన్యం ఉందని తెలిస్తే క్యామియోలు చేయడానికి ఉపేంద్ర వెనుకాడటం లేదు. రజనీకాంత్ కూలి, శివరాజ్ కుమార్ 45 అందుకే ఒప్పుకున్నారు.
ఉపేంద్ర తెలుగు స్ట్రెయిట్ సినిమా చివరిసారి చేసింది వరుణ్ తేజ్ గనిలో. అది డిజాస్టర్ కావడంతో ప్రేక్షకులకు గుర్తు లేకుండా పోయింది. ఇప్పుడు రామ్ తో కనక జట్టుకడితే మంచి కాంబో అవుతుంది. ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం అవ్వాలనే కోరుకుంటున్నారు. కథ ప్రకారం ఇందులో ఈ పాత్ర నిజంగానే సినిమా హీరోనట. మరి కాలేజీలో చదువుకునే రామ్ కి ఇతనికి ఎలా లింక్ కుదురుతుందనేది అంతా ఓకే అయ్యి షూటింగ్ చేసుకుని రిలీజయ్యాక చూడాలి. దసరా లేదా దీపావళి విడుదలను టార్గెట్ చేసుకుంటున్న ఈ మూవీని వీలైనంత పోటీ లేకుండా సోలోగా దింపాలని మైత్రి ప్లాన్.