కొత్త డౌట్లు పుట్టిస్తున్న చిరంజీవి

కరోనా వల్ల ఒక రెండు నెలలు షూటింగ్‌లు ఆగిపోతేనే.. తెలుగు సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. షూటింగ్‌లకు అనుమతులివ్వాలని మొరపెట్టుకున్నారు. కొన్ని రోజులకు వాళ్లు కోరుకున్నట్లే షూటింగ్స్ పున:ప్రారంభించుకోవడానికి అనుమతలు వచ్చాయి. కానీ కరోనా విజృంభణ కారణంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

వైరస్ ప్రభావంతో పాటు జనాల్లో భయం కూడా కొంచెం తగ్గాక గత రెండు నెలల్లో ఒక్కొక్కటిగా సినిమాలు తిరిగి పట్టాలెక్కాయి. కానీ షూటింగ్‌లకు అనుమతలు కోసం పరిశ్రమ తరఫున తిరిగిన చిరు మాత్రం ఇప్పటిదాకా తిరిగి సెట్స్ మీదికి వెళ్లలేదు. కరోనాకు చిరు భయపడుతుండటం వల్లే ఆలస్యం చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు.

ఐతే ఎట్టకేలకు నవంబరు 4 నుంచి చిరు మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని, ‘ఆచార్య’ మళ్లీ పట్టాలెక్కబోతోందని వార్తలొచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో హుషారు పుట్టింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వారంలో కూడా ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం కావట్లేదని అంటున్నారు. సంక్రాంతి తర్వాతే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని వార్తలొస్తున్నాయి. మధ్యలో చిరు లూసిఫర్ లేదా వేదాళం రీమేక్‌ను పట్టాలెక్కిస్తాడని కూడా చెబుతున్నారు. దీంతో ‘ఆచార్య’తో వచ్చిన ఇబ్బందేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇన్ని రోజులు ఆలస్యం జరగడానికి, ఇక ముందూ లేట్ కాబోతుండటానికి కారణం స్క్రిప్టులో మార్పులే అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఆ మధ్య ఈ సినిమా కథ కాపీ అంటూ రాజేష్ అనే ఒక రచయిత పెద్ద గొడవే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్క్రిప్టులో మార్పులు అనేసరికి.. అతడి అభ్యంతరాల నేపథ్యంలో ఇది జరుగుతోందా.. చిరును సంతృప్తి పరిచేలా మార్పులు చేయడంలో ఆలస్యమవుతోందా.. అందుకే షూటింగ్ పున:ప్రారంభించలేకపోతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆచార్య’ ఇలాగే ఆలస్యమవుతుంటే ఈ సందేహాలు మరింత పెరగడం ఖాయం.