బాహుబలి నిర్మాతలు…ఫహద్ సినిమాలు…ఏమయ్యాయి ?

పుష్ప విలన్ గా మనకు బాగా దగ్గరైన మలయాళ హీరో ఫాహద్ ఫాసిల్ తో బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా గత ఏడాది మార్చిలో రెండు సినిమాలు ప్రకటించారు. అవి ఆక్సీజెన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. వీటికి ఎస్ఎస్ రాజమౌళి సమర్పకులుగా వ్యహరిస్తారని పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వదిలారు. ఇదంతా జరిగి సంవత్సరం గడిచిపోయింది. రెండు మూడు సార్లు ట్రబుల్ కోసం క్యాస్టింగ్ కాల్ ప్రకటనలు ఇచ్చారు తప్పించి ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. ఇదంతా ఆవేశం రిలీజ్ ముందు జరిగిన వ్యవహారం. ఇవి నిజంగా జరుగుతున్నాయా లేదానే అనుమానాలు మల్లువుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నాయి. షూటింగ్ కు వెళ్ళడానికి ముందే పూర్తి చేయాలనుకున్న ఓటిటి డీల్స్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో పాటు ఫహద్ ఫాసిల్ బిజీ షెడ్యూల్స్ ఈ ప్రాజెక్టులను పెండింగ్ లో ఉంచాయట. పుష్ప 2 డేట్లకే సుకుమార్ కష్టపడాల్సి వచ్చింది. గత కొంత కాలంగా ఓటిటి మార్కెట్ బాగా డౌన్ లో ఉంది. టయర్ 1 స్టార్ హీరోలకు తప్ప మిగిలిన వాటికి అంత త్వరగా అగ్రిమెంట్లు జరగడం లేదు. ఫహద్ ఫాసిల్ ఫస్ట్ క్యాటగిరీలో లేకపోవడంతో తన మీద పెద్ద మొత్తాలు పెట్టేందుకు డిజిటల్ సంస్థలు సిద్ధంగా లేవట.

అటు ఆర్కా హ్యాండిల్ లోనూ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. బాహుబలి చరిత్ర సృష్టించినా సినిమాల నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఆర్కా మీడియా రాజమౌళి అండగా ఉన్నా సరే ఇంత నెమ్మదిగా అడుగులు వేయడం ఆశ్చర్యమే. ఆక్సీజెన్ కు సిద్దార్థ్ నాదెళ్ల, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కి శశాంక్ యేలేటి దర్శకులుగా లాకయ్యారు. రెండింటికి కాల భైరవనే సంగీతం సమకూర్చాల్సి ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినట్టు లేవు. పోస్టర్లు చూస్తే మంచి కంటెంట్ లాగే అనిపించింది కానీ ఇంత ఆలస్యం జరగడం వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయేమో.