ఊర్వశి రౌతెలా.. ఇది టూమచ్‌గా లేదూ?

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో వేర్ ఈజ్ ద పార్టీతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చిత్రం ‘డాకు మహారాజ్’లోనూ ఆమెకు అవకాశం దక్కింది. అందులో ‘దబిడి దిబిడి’ అంటూ సాగే పాటలో ఆమె వేసిన స్టెప్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఇందులో ఒక పాత్ర కూడా చేసిందామె.

తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకుంటున్న ఊర్వశి..తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు ఉత్తరాదిన అభిమానులు గుడి కట్టి పూజలు చేస్తున్నారని.. అలాగే దక్షిణాది వారు కూడా చేయాలని కోరుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించడం విశేషం.

బద్రీనాథ్‌లో తనకు అభిమానులు గుడి కట్టినట్లు చెప్పి ఊర్వశి పెద్ద షాకే ఇచ్చింది. ఆ గుడి పేరు కూడా ‘ఊర్వశి మందిర్’ అని వెల్లడించింది. ఇంటర్వ్యూయర్ ఇది నిజమా.. గుడి ఎక్కడ ఉంది అని అడిగితే ఆమె తడుముకోకుండా సమాధానం చెప్పింది. బద్రీనాథ్ ప్రధాన ఆలయం నుంచి కిలోమీటర్ దూరంలో ఈ ‘ఊర్వశి మందిర్’ ఉందని.. అక్కడ తన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారని చెప్పింది.

తాను తెలుగులో ఏడాదిన్నర వ్యవధిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించానని.. ఇక్కడ కూడా తనకు భారీగా ఫ్యాన్స్ పెరిగారని ఆమె తెలిపింది. ఉత్తరాదిలో మాదిరే ఇక్కడి ఫ్యాన్స్ కూడా తనకు టెంపుల్స్ కట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మీ పేరున ఉన్న గుడిలో మీ విగ్రహం పెట్టి, పూజలు చేస్తున్నారా అని అడిగితే.. అంతే కదా, అదే కదా చేస్తారు అని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా వివాదాల్లో భాగమైన ఊర్వశి.. తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది.