రెమ్యూనరేషన్ తేడాలపై సమంత వాయిస్

సినీ రంగంలో హీరోలకు భారీగా పారితోషకాలు ఇస్తారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. ఈ విషయంలో హీరోయిన్లు అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోరు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ విషయమై ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. హీరో, హీరోయిన్ అని తేడా ఏమీ లేదని.. ఎవరు ఎక్కువగా థియేటర్లకు జనాలను పుల్ చేస్తారో వాళ్లకు ఎక్కువ పారితోషకం దక్కుతుందని.. సింపుల్ అని తేల్చేశాడాయన. కానీ హీరోయిన్లు ఈ వాదనతో ఏకీభవించరు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత సైతం తాజాగా పారితోషకాల్లో తేడాలపై వాయిస్ వినిపించింది.

ఇరువురూ ఒకేలా కష్టపడుతున్నపుడు రెమ్యూనరేషన్లలో ఈ తేడాలేంటని ఆమె ప్రశ్నించింది. తన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాలో ఆడ, మగ అని తేడా లేకుండా అందరికీ ఒకేలా పారితోషకం ఇస్తున్నట్లుగా నందిని రెడ్డి చెప్పిన విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ‘‘ఇప్పటికి నేను ఎన్నో సినిమాల్లో నటించాను. నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. కానీ వారికి ఇచ్చే రెమ్యూనరేషన్లలో మాత్రం తేడా ఉంటుంది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ పారితోషకం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో నన్ను ఇబ్బంది పెట్టే విషయాల్లో ఇదొకటి.

అందుకే నేను దీన్ని రిపీట్ చేయకూడదని అనుకుంటున్నా. మార్పు కోసం ప్రయత్నిస్తున్నా. గతాన్ని నేను మార్చలేను. మార్పు నాతోనే మొదలు కావాలని నా సంస్థలో ఈ తేడాలు లేకుండా చూసుకుంటున్నా. అలాగని పురుషులు, మహిళలకు సమానంగా పారితోషకాలు ఇవ్వాలని నేను పోరాడుతున్నట్లు కాదు. కష్టాన్ని చూసి రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అంతే తప్ప నాకు ఇంత ఇవ్వండి అని నేను యాచించాల్సిన అవసరం లేదు’’ అని సమంత స్పష్టం చేసింది. ‘మా ఇంటి బంగారం’ సినిమాను ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సొంత బేనర్ మీద సమంత ప్రొడ్యూస్ చేస్తోంది.