కన్నుగీటు సుందరికి బ్రేక్ దొరికింది

ఏడేళ్ల క్రితం ఒక చిన్న సీన్ ఆమెకు ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. కుర్రాడిని చూస్తూ కన్నుగీటుతున్న సన్నివేశం దేశంలోనే కాదు ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా చూసేంత వైరలైపోయింది. కట్ చేస్తే ఆ ఎపిసోడ్ ఉన్న ఓరు ఆధార్ లవ్ అనే సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయి పెద్ద ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తెలుగులో లవర్స్ డేగా డబ్బింగ్ చేశారు కానీ మనోళ్లు అంతగా పట్టించుకోలేదు. ఆ అమ్మడే ప్రియా ప్రకాష్ వారియర్. 2019లో ఇంత సెన్సేషనల్ డెబ్యూ చేశాక తనకు తిరుగు లేదనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ప్రియా వారియర్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.

టాలీవుడ్ లో నితిన్ చెక్, పవన్ కళ్యాణ్ బ్రో లాంటి వాటిలో చేసినా వాటి ఫలితాలు తనకు మలుపు ఇవ్వలేకపోయాయి. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మా నీకు అంత కోపమాలో మంచి పాత్రే దొరికింది కానీ బాక్సాఫీస్ వద్ద బొమ్మ ఆడకపోవడంతో మరోసారి నిరాశే మిగిలింది. కట్ చేస్తే గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ పక్కన వేసిన సపోర్టింగ్ రోల్ ఒక్కసారిగా తన జాతకాన్ని మార్చేలా ఉంది. అలాని పెర్ఫార్మన్స్ బ్రహ్మాండంగా చేసిందని కాదు. విలన్ అర్జున్ దాస్ తో కలిసి సుల్తానా అంటూ పాత పాటకు వేసిన స్టెప్పులు అప్పట్లో దాంట్లో నర్తించిన సిమ్రాన్ ని గుర్తు చేయడంతో తమిళ ఆడియన్స్ ప్రియాతో బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఈమె ఎపిసోడ్ తాలూకు వీడియోలను షేర్ చేసుకోవడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ రెస్పాన్స్ చూసి ప్రియా ప్రకాష్ వారియర్ చాలా హ్యాపీగా ఉంది. స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశాలు రాకపోయినా అజిత్ సినిమాలో చేసిన ఆనందం, ఆయనతో దగ్గరి నుంచి పని చేసిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోతాయని అంటోంది. 2019లో పోలిస్తే ప్రియా వారియర్ లో చాలా మార్పులొచ్చాయి. మలయాళం, కన్నడలో చెప్పుకోదగ్గ సినిమాలైతే చేసింది కానీ గుర్తింపు వచ్చింది మాత్రం గుడ్ బ్యాడ్ అగ్లీతోనే. మరి తర్వాత కూడా అన్నీ ఇలాంటి క్యారెక్టర్లే వస్తే మాత్రం ఆదాయం తప్ప ఆనందం ఉండకపోవచ్చు. చూద్దాం.