నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్ గా చూసి సంవత్సరాలు గడిచిపోయిన అభిమానుల ఆకలిని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పూర్తిగా తీర్చేశాడు. పాత పాటలను వాడుకున్న తీరు, అజిత్ బ్లాక్ బస్టర్ల రెఫరెన్సులు ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాయి. కోలీవుడ్ ఫాన్స్ వరకు ఓకే కానీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ ఓవర్ లౌడ్ మాస్ కంటెంట్ అంతగా కనెక్ట్ కావడం లేదని రివ్యూలు, టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. ఓపెనింగ్స్ వరకు పక్క రాష్ట్రంలో రికార్డులు మొదలలైనా డబ్బింగ్ వెర్షన్లు మేజిక్ చేయడం అనుమానంగానే ఉంది.
ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ముంత మసాలా టైపులో ఆధిక్ అన్నీ కలిపేసి గుడ్ బ్యాడ్ ఆగ్లీని తీశాడు. బాషా తరహా గ్యాంగ్ స్టర్ బిల్డప్, గజిని నుంచి విలన్ డబుల్ రోల్ కాన్సెప్ట్, గతంలో చూసిన తండ్రిని ద్వేషించే కొడుకు ఎపిసోడ్, చెన్నకేశవరెడ్డిలో పోలీసులకు హెల్ప్ చేసే హీరో థ్రెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఇన్స్ పిరేషన్లు చివరి దాకా వస్తూనే ఉంటాయి. అయితే ఫ్యాన్స్ కి ఇవే బాగా కిక్ ఇచ్చాయి. లాజిక్స్ గాలికి వదిలేసి ఓవర్ బోర్డ్ హీరోయిజం నింపేసినా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న వైనం సోషల్ మీడియా ట్వీట్స్ లో కనిపిస్తోంది. బుక్ మై షోలో ఫస్ట్ డే మూడున్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయట.
ఇదంతా బాగానే ఉన్నా గుడ్ బ్యాడ్ అగ్లీలో ఒకప్పటి వింటేజ్ అజిత్ కనిపించాడు కానీ గ్యాంబ్లర్, వాలి, విశ్వాసం తరహాలో పవర్ ఫుల్ సబ్జెక్టు మాత్రం ఇందులో కుదరలేదు. సంగీతం కూడా ఏదో ఆ ఊపులో ఓకే అనిపించింది కానీ విడిగా చూస్తే జివి ప్రకాష్ కుమార్ స్థాయిలో మ్యూజిక్ లేదనేది ఓపెన్ కామెంట్. సరే ఏదైతేనేం మొదటి రోజు ట్రెండ్ చూస్తుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గత చిత్రం విడాముయార్చిలా కాకుండా హిట్ దిశగా వెళ్లేలా ఉంది. బ్లాక్ బస్టర్ అవుతుందా లేదానేది వీకెండ్ నిర్ణయించబోతోంది. టాక్ ఎలా ఉన్నా తమిళనాడు, ఓవర్సీస్ లో మాత్రం పెద్ద నెంబర్లు నమోదు కావడం ఖాయమని ట్రేడ్ టాక్.