అర్జున్ రెడ్డి మ్యూజిక్ వివాదం….రధన్ వివరణ

టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత గొప్పగా వర్కౌటయ్యాయో అభిమానులకు గుర్తే. అయితే ఇతనితో పని చేయించుకోవడం సందీప్ రెడ్డి వంగా గతంలో తీవ్ర విమర్శలు చేయడం వైరలయ్యింది. రధన్ చాలా ఇబ్బంది పెట్టాడని, బ్రతిమాలి పాటలు రాబట్టుకున్నాననే తరహాలో చెప్పడం ఇండస్ట్రీలోనూ చర్చగా మారింది. దాని తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంతకన్నా తీవ్రమైన కామెంట్లు రధన్ గురించి సిద్దార్థ్ రాయ్ దర్శకుడు యశస్వి చేయడం హాట్ టాపిక్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత వీటికి స్పష్టత ఇచ్చాడు రధన్.

రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రమోషన్లలో రధన్ దీనికి గురించి కుండ బద్దలు కొట్టేశాడు. సందీప్ వంగా తనకు తండ్రి లాంటి వాడని, ఆయన అవకాశం ఇవ్వడం వల్లే అంత మంచి ఆల్బమ్ వచ్చిందని, మాట కొంచెం కఠినంగా ఉన్నా అందరితోనూ అలాగే ఉండే శైలిని అర్థం చేసుకున్నానని వివరించాడు. మొదటి పాట నచ్చనప్పుడే చెప్పి ఉంటే బాగుండేదని, అంతా అయిపోయాక అలా అన్నందుకు బాధ కలిగిందని అన్నాడు. అర్జున్ రెడ్డి సాంగ్స్ రధన్ ఇచ్చినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ఏది ఏమైనా డైరెక్టర్లతో ఇలా వివాదాలు తెచ్చుకోవడం వల్లే రధన్ కెరీర్ ఆశించినంత వేగంగా లేదని ఇండస్ట్రీ కామెంట్. సరిగా ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉండేవాడని కూడా అంటుంటారు. ఇప్పుడు సందీప్ వంగాని ఏకంగా తండ్రితో పోల్చి మరీ గౌరవం ఇచ్చిన రధన్ చివరికి కాంట్రావర్సికి చెక్ పెట్టినట్టే అనుకోవాలి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి రధనే సంగీతం అందించాడు. ఈ వారం పోటీలో ఉన్న సినిమాల్లో వినోదం పరంగా దీనికే కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది. టాక్ కనక తెచ్చుకుంటే కనీసం వారం రోజులు మంచి థియేట్రికల్ రన్ దక్కుతుంది.