ది రాజా సాబ్ విషయంలో జరుగుతున్న ఆలస్యం, అప్డేట్స్ లేకుండా కనిపిస్తున్న నిర్లిప్తత ఫ్యాన్స్ ని ఫ్రస్ట్రేట్ చేస్తున్న మాట వాస్తవం. దర్శకుడు మారుతీ తన ఎక్స్ లో పెడుతున్న ట్వీట్స్ కు కామెంట్స్ పెట్టకుండా ఆప్షన్ ఎంచుకోవడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న తత్వం అనే చిన్న సినిమాకు విష్ చేసిన మారుతీ దాని కింద ఎవరూ రెస్పాండ్ కాకుండా చూసుకున్నారు. ఇవాళ పుణ్యక్షేత్రాల సందర్శన సందర్భంగా పెట్టిన ఫోటోలకు ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకపోవడంతో యథావిధిగా ఫ్యాన్స్ కామెంట్స్ తో దాడి చేశారు. నిజానికి ఇక్కడ మారుతీ వైపే అన్ని వేళ్ళు లేవు.
రకరకాల కారణాలతో రాజా సాబ్ కు బ్రేక్ పడింది.కొంచెం టైం పట్టేలా ఉండటంతో ప్రభాస్ ఫౌజీ వైపు ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ వెర్షన్ వేరేలా ఉంది. రాజా సాబ్ ని ఏప్రిల్ నుంచి వాయిదా వేసుకున్నాక కనీసం ఇంకో రెండు మూడు నెలల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా కాలం వృథా చేస్తూ పోతే ఉన్న బజ్ కూడా తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ ఏడాది వస్తుందా రాదానే అనుమానాలు వాళ్లలో బలంగా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వైపు నుంచి ఫ్రెష్ గా వాయిదా గురించైనా సరే ఒక అఫీషియల్ అప్డేట్ వస్తే అభిమానుల అసంతృప్తిని కొంత తగ్గించవచ్చు.
అసలే ప్రభాస్ లైనప్ చాలా పెద్దది ఉంది. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2 ఇలా దర్శకులందరూ క్యూ కట్టి ఉన్నారు. అన్నీ లెక్కేసుకుంటే పేపర్ మీద బడ్జెట్ రెండు వేల కోట్లు దాటిపోతుంది. టయర్ 1 స్టార్ హీరోల్లో వేగంగా ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రభాస్ రిలీజ్ ప్లానింగ్ పరంగా అంతే స్పీడ్ గా లేకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందడం న్యాయమే. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుటి ట్యూన్స్ ఇప్పుడు అవుట్ డేట్ అయ్యాయని, కొత్త పాటలు కంపోజ్ చేస్తున్నానని ఇటీవలే తమన్ చెప్పడం మరో కొసమెరుపు. చెట్టెక్కిన భేతాళుడిలా రాజా సాబ్ ఆగమనం త్వరలో అయితే జరిగేలా లేదు.