కండలవీరుడి హిట్టు కోసం బాహుబలి రచయిత

దర్శకధీర రాజమౌళి సినిమాలన్నింటికి కథలు ఇచ్చే విజయేంద్ర ప్రసాద్ హిందీలోనూ తన ముద్ర వేస్తుంటారు. సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ ఈయన కలం నుంచి జాలువారిందే. పసివాడి ప్రాణంని స్ఫూర్తిగా తీసుకుని కమర్షియల్ హీరో సబ్జెక్టుకి చైల్డ్ సెంటిమెంట్ జోడించడం వల్లే దానికి అద్భుత ఫలితం దక్కిందని విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో చెప్పారు. దీని తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం కండల వీరుడికి దక్కలేదు. కిసీకా భాయ్ కిసీకా జాన్, సికందర్ అయితే మరీ దారుణంగా పోయాయి. ఫ్యాన్స్ ఏకంగా భాయ్ ఇంటికెళ్లి మరీ తాము పడుతున్న మానసిక క్షోభను పంచుకున్నారు.

ఇలాగే ఉంటే తన స్టార్ ఇమేజ్ కే మచ్చ వచ్చేలా ఉందని గుర్తించిన సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ 2 సన్నాహాల్లో ఉన్నట్టు బాలీవుడ్ టాక్. దర్శకుడు కబీర్ ఖాన్ ఈ విషయంగానే ఇటీవలే కలుసుకున్నట్టు సమాచారం. మొదటి భాగం 2015లో వచ్చింది. అంటే పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫస్ట్ పార్ట్ లో చూపించిన చిన్న పాప పాకిస్థాన్ వెళ్ళిపోయి టీనేజ్ కొచ్చి ఉంటుంది. ఒకవేళ తను ఇండియాకు తిరిగి వచ్చి, ఆమె మీద కోపంతో పాక్ టెర్రరిస్టుల వల్ల ఇక్కడ ప్రమాదం తలెత్తితే భాయ్ జాన్ ఎలా కాపాడాడనే పాయింట్ మీద మంచి యాక్షన్ డ్రామాని డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడీ పనే జరుగుతోందట.

ఏది ఏమైనా బాలీవుడ్ ఖాన్లకు హిట్లు కావాలంటే మన రైటర్లు, డైరెక్టర్లే అవసరం పడటం అనూహ్యం. ఒకప్పుడు దక్షిణాది అంటే మొహం చాటేసే సల్మాన్ ఇప్పుడు అడిగి మరీ పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. మురుగదాస్ ఛాన్స్ కొట్టేసింది ఈ కారణంగానే. అంతకు ముందు పంజా దర్శకుడు విష్ణువర్ధన్ తో బుల్ ప్లాన్ చేసుకున్న సల్మాన్ ఏవో కారణాల వల్ల దాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కనక భజరంగి భాయ్ 2కి సరిపడా కథని సిద్ధం చేస్తే వచ్చే ఏడాదిలోగా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చినా రిలీజ్ మాత్రం 2027లోనే ఉండొచ్చు.