అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత చైతూ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ ఉత్సాహంలో చైతూ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లరే. ఇది చైతూకు 24వ చిత్రం.
దీని తర్వాత చైతూ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రాజెక్టును కిిశోర్ అనే కొత్త దర్శకుడి చేతికి అప్పగించారట. అతను చెప్పిన కథకు ఇటీవలే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచాచారం. 25వ చిత్రం కోసం కొంత కాలంగా కథలు వింటున్నాడు చైతూ. ఐతే కొత్త దర్శకుడైన కిశోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించినట్లు సమాచారం. కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇదట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేద్దామని కూడా చూస్తున్నారట. లేదంటే ఏదైనా బయటి బేనర్ కూడా రంగంలోకి దిగొచ్చు.
మరోవైపు చైతూ తండ్రి నాగార్జున ఇంకా పెద్ద మైలురాయి ముంగిట నిలిచారు. హీరోగా ఆయన వందో చిత్రం గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమిళ దర్శకుడైన నవీన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. నాగ్ 100వ సినిమా, చైతూ 25వ సినిమా దాదాపుగా ఒకే సమయంలో సెట్స్ మీదికి వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇవి పట్టాలెక్కొచ్చు.