టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో హ్యాట్రిక్ కొట్టి కెరీర్ పీక్స్ ఎంజాయ్ చేస్తోంది. తనుంటే చాలు బిజినెస్ పరంగానూ హెల్పవుతోంది. ఇంకేం సల్మాన్ ఖాన్ సికందర్ కూడా హిట్టే అనుకున్నారు ఫ్యాన్స్. తీరా చూస్తే కేవలం ఫస్ట్ హాఫ్ నలభై నిమిషాలకు మాత్రమే తన పాత్రను పరిమితం చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. కథ పరంగా ఆమె చనిపోవడం కీలకమైన పాయింట్. అంత మాత్రాన ఇలాంటి క్యారెక్టర్ కి రష్మికని ఎంచుకోవడం ఏమిటని మూవీ లవర్స్ ఫీలైన దాఖలాలు సోషల్ మీడియాలో ఉన్నాయి.
నిడివి సంగతి పక్కనపెడితే సల్మాన్ ఖాన్ భార్యగా రష్మిక ఏ మాత్రం నప్పలేదు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం పెద్ద సమస్య కాకపోయినా ఇద్దరూ కపుల్ లా లేకపోవడం చూసేవాళ్లను ఇబ్బంది పెట్టింది. దానికి తోడు సల్మాన్ భాయ్ నీరసమైన యాక్టింగ్, తేడా కొట్టిన డబ్బింగ్ మరింత డ్యామేజ్ చేశాయి. రాజ్ కోట్ ఊరికి రాణిగా పెద్ద బిల్డప్ డిజైన్ చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆమెను సరైన రీతిలో వాడుకోలేకపోయాడు. ఒక పాట తొలి సగంలో, రెండో పాట ఎండ్ టైటిల్స్ లో సల్మాన్ తో డాన్స్ చేయించాడు. అవి కూడా పేలలేదు. మొత్తానికి రష్మిక మందన్న ఎక్స్ ప్రెస్ వేగానికి పెద్ద బ్రేక్ పడినట్టే.
రివ్యూలు, రిపోర్టులు సికందర్ కు ప్రతికూలంగా ఉన్నాయి. ఆదివారం, సెలవులు, రంజాన్ పండగ లాంటి సానుకూలాంశాలు ఎన్ని ఉన్నా కంటెంట్ మరీ బీసీ కాలం నాటిది కావడంతో ఆడియన్స్ చివరిదాకా కూర్చోవడం కష్టంగా ఫీలవుతున్నారు. మెయిన్ విలన్ గా కట్టప్ప అలియాస్ సత్యరాజ్ ని పెట్టడం తేడా కొట్టేసింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం గురించి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. డిజాస్టర్ల నుంచి తనకు రిలీఫ్ ఇస్తుందని సల్మాన్ ఖాన్ భావించిన సికందర్ సైతం అదే ఫ్లాపుల బాట పట్టడంతో ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. దీనికన్నా ముందే క్రేజీ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం మరో కుదుపు.