మహేష్ బాబు సినిమా గురించి వరదరాజ మన్నార్

ఎక్కడ ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసినా అదో పెద్ద సంచలనంగా మారిపోయిన ఎస్ఎస్ఎంబి 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా అధికారికంగా చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం చేయలేదు. ఒకటి రెండు షెడ్యూల్స్ అయ్యాక మీడియాని కలుస్తారనే వార్తలు తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంతకీ కార్యరూపం దాల్చడం లేదు. ఆఖరికి పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం బయటికి రాకుండా మేనేజ్ చేశారు. కనీసం వెయ్యి కోట్లతో థియేటర్ బిజినెస్ మొదలవుతుందనే అంచనాలు దీని మీద బలంగా ఉన్నాయి. దీని తాలూకు విశేషాలు ఎప్పుడెప్పుడు దొరుకుతాయాని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్2 ఎంపురాన్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయనకు ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాను ఏడాది పై నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నానని, ప్రస్తుతానికి ఇంతకు మించి వివరాలు చెప్పలేనని, అయినా లీకుల వీడియోలు ఫోటోలు చూడటం వల్ల కొందరు ఎలాంటి ఆనందం పొందుతున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి టైం వచ్చినప్పుడు ఇదే ప్లాట్ ఫార్మ్ మీద మరోసారి మహేష్ మూవీ గురించి మాట్లాడుకుందామని డాటవేశాడు.

ఈ మూవీలో పృథ్విరాజ్ విలనా లేక ఇంకేదైనా ముఖ్యమైన పాత్రా అనేది బయటికి రాలేదు. ప్రతినాయకుడిగా నటించడం ఆయనకు కొత్త కాదు. ఆ మధ్య అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియాలో చేశారు కానీ అది ఆశించిన ఫలితం అందుకోలేదు. సలార్ లోనూ విలన్ అన్నారు కానీ తీరా సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ప్రాధాన్యం ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇది కాసేపు పక్కనపెడితే భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ తీసిన ఎల్2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఆశ్చర్యపోయే నెంబర్లు నమోదు చేస్తోంది. తెలుగులో నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున పంపిణి చేస్తున్నారు.