యుకేలో ఫ్యాన్స్ మీట్ దందా… చిరు ఆగ్రహం

మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్ హాల్‌లో సత్కారం అందుకోవడం అభిమానులను అమితానందానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సందర్భంగా ఫ్యాన్స్ మీట్ పేరుతో ఓ సంస్థ దందా నిర్వహించిన విషయం తెలిసి చిరంజీవి అలెర్ట్ అయ్యారు. తన మీద అభిమానంతో తనను కలవడానికి వచ్చిన అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.‘‘ప్రియమైన అభిమానులారా.. యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన ప్రేమ, ఆదరణ నా మనసును హత్తుకుంది. కానీ ఫ్యాన్‌ మీట్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిని నేను సమర్థించను.

దీన్ని గట్టిగా ఖండిస్తున్నాను. ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా, ఎక్కడైనా నేను ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించను. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం అపారమైనది, విలువైనది. మన ఆత్మీయ కలయికను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దయచేసి స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిరుకు జరిగిన సత్కారం ఏంటి.. ఎవరు చేశారనే విషయంలో నిన్నట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది.

యూకే పార్లమెంటే ఆయన్ని సత్కరించినట్లుగా పవన్ కళ్యాణ్ సహా చాలామంది పోస్టులు పెట్టారు కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. యూకే పార్లమెంట్ హాల్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒక ప్రైవేటు సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దీనికి యూకే పార్లమెంటేరియన్లు కొందరు అతిథులుగా వచ్చారు. ఇది విశేషమే అయినప్పటికీ.. యూకే పార్లమెంటే చిరును సత్కరించినట్లుగా పేర్కొనడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.