సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక రెండు నెలలు తిరక్కముందే ఫిబ్రవరిలో తండేల్ రూపంలో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. పోటీదారులు నెలకు రెండు మూడు సినిమాలు చేస్తున్నా దేవి మాత్రం నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్నాడు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీకి ముందు లాక్ చేసుకున్న సంగీత దర్శకుడు దేవినే. కానీ పుష్ప 2 బిజిఎం విషయంలో తలెత్తిన వివాదం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనే వార్త చాలా కాలం క్రితమే చక్కర్లు కొట్టింది.
ఇప్పుడా గుడ్ బ్యాడ్ అగ్లీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్, ఒక్కొక్కటిగా వస్తున్న లిరికల్ సాంగ్స్ విజువల్ గా ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తున్నాయి కానీ ఆడియో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. కోలీవుడ్ మార్కెట్ లో ఈ సినిమాకు మాములు హైప్ లేదు. మంకతా (గ్యాంబ్లర్) రేంజులో వింటేజ్ అజిత్ ని చూడబోతున్నామని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు అధిక్ రవిచందర్ వదులుతున్న శాంపిల్స్ అంచనాలు పెంచుతున్నాయి. సహజంగా ఇలాంటి మాస్ సినిమాల సంగీతం గురించి ఇంటా బయటా హైప్ ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ గుడ్ బ్యాడ్ అగ్లీకి దేవినే కొనసాగి ఉంటే మరింత ఎలివేషన్ దక్కేదనే కామెంట్ లో నిజం లేకపోలేదు. తమిళ సినిమాలతో దేవి బాండింగ్ ఎప్పటి నుంచో ఉంది. సింగం, ఆరు, కందస్వామి, మజై, బద్రి, అలెక్స్ పాండియన్ లాంటి ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గా తన మీద మంచి ఇంప్రెషనే ఉంది. ఒకవేళ అజిత్ మూవీకి కూడా దేవి పని చేసి ఉంటే పుష్ప స్థాయిలో అదిరిపోయే పాటలు వచ్చేవేమో. అయితే జివి పనితనం పూర్తిగా బయట పడేది ఏప్రిల్ 10నే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అజిత్ మూడు నాలుగు షేడ్స్ లో విశ్వరూపం చూపించాడని టాక్.