ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్ సినిమా విజయం సాధించడం సాధ్యమేనని కోర్ట్ మరోసారి రుజువు చేసింది. గతంలో ఇలాంటి హిట్లు లేవని కాదు. కానీ న్యాయస్థానం బ్యాక్ డ్రాప్ లో వచ్చినవి చాలా తక్కువ. క్లైమాక్స్ కు ముందో లేదా మధ్యలోనో రెండు మూడు సీన్లకు పరిమితం చేయడం తప్ప సగం పైగా సినిమాని కోర్ట్ హాల్లోనే నడపడం ఇంతకుముందు టాలీవుడ్ ట్రెండ్ కాదు. హిందీ, మలయాళంలో తరచుగా చూస్తుంటాం కానీ తెలుగులో తక్కువ. ఇప్పుడు కోర్ట్ కొత్త దారి చూపించిందా అంటే ఔననే చెప్పాలి. కాస్త లోతుగా విశ్లేషిద్దాం.
ఇలాంటి సినిమాల్లో వాదోపవాదాలు జరుగుతూ అధిక భాగం కోర్టులోనే ఉండటం వల్ల వేగం కోరుకునే మన ఆడియన్స్ కు అవి సూటవ్వవనే ఉద్దేశంతో దర్శక రచయితలు ఆ దిశగా ఆలోచన చేసేవాళ్ళు కాదు. చిరంజీవి ‘అభిలాష’లో బ్యాక్ డ్రాప్ ఒక నిర్దోషి కేసులో ఇరుక్కోవడమే. కానీ కథ ఎక్కువ బయటే జరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే కోర్టు ఆర్గుమెంట్లు చూపిస్తారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దామిని తెలుగులో ‘ఊర్మిళ’గా రీమేక్ చేస్తే ఇక్కడ సూపర్ ఫ్లాపయ్యింది. కారణం చెప్పనక్కర్లేదు. ఘనవిజయం సాధించిన అనిల్ కపూర్ ‘మేరీ జంగ్’ని శోభన్ బాబు ‘విజృంభణ’గా కోరి మరీ చేస్తే ఇక్కడ అంత విజయం సాధించలేకపోయింది.
ఠాగూర్, రాఖీ చివరి ఇరవై నిమిషాల్లో హీరోల పెర్ఫార్మన్స్ కు కోర్ట్ వాతావరణం తోడై ఆడియన్స్ ని గొప్పగా మెప్పించాయి. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ లో మార్పు వచ్చింది. ‘వకీల్ సాబ్’కు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడై కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ సెకండాఫ్ మొత్తం కోర్టులోనే ఉంటుంది. అల్లరి నరేష్ ‘నాంది’ మరో మంచి ఎగ్జాంపుల్. తాజాగా వచ్చిన ‘కోర్ట్’ ఈ ట్రెండుకి మరింత ఊచమిచ్చేలా ఫలితం దక్కించుకుంది. ఇకపై స్టార్ హీరోలు కూడా వీటిపై సీరియస్ గా దృష్టి సారిస్తే అద్భుతమైన కోర్ట్ సినిమాలు నేరుగా తెలుగులోనే చూడొచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.