శివాజీ…కొత్త విలన్ దొరికేశాడు

టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం లేదు. తెలుగు నటులు అయితేనే వాటికి న్యాయం చేయగలరు. అందుకే జగపతిబాబు, శ్రీకాంత్, రావు రమేష్ లాంటి వాళ్ళు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. అయితే వీళ్ళు అందరికీ అందుబాటులో లేరు. డేట్ల సమస్య, భారీ పారితోషికాలు లాంటి కారణాలు మీడియం బడ్జెట్ సినిమాలకు ఇబ్బందే. తాజాగా కోర్ట్ చూశాక శివాజీ రూపంలో మనకో కొత్త ప్రతినాయకుడు దొరికాడన్న ఆనందం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. దానికి కారణం నిర్మాత నాని, దర్శకుడు రామ్ జగదీషే.

సరే ఇంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మంగపతి అనే పాత్ర ద్వారా నాదైన రోజు 25 సంవత్సరాల తర్వాత వచ్చిందని, 90స్ మిడిల్ క్లాస్ తర్వాత ఎన్నో కథలు విన్నా హీరోగా చేయడం కన్నా గుమ్మడి, రాజనాల తరహాలో నెగటివ్ షేడ్స్ ఉన్నా పర్వాలేదని మంచి పాత్ర కోసం ఎదురు చూశానని, అది కోర్ట్ రూపంలో నెరవేరిందని శివాజీ ఆనందం వ్యక్తం చేశారు. మంగపతిగా ఇప్పుడొచ్చిన గుర్తింపును సద్వినియోగపరుచుకుంటానని అన్నారు. ఆల్రెడీ ఆయనే నిర్మాతగా లయతో పాటు ఒక సినిమా సెట్స్ మీద దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉంది.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1997 మాస్టర్ తో తెరంగేట్రం చేశాక శివాజీ సోలో హీరోగా చేసిన కాలేజీ, యూత్, వైఫ్, అమ్మాయి బాగుంది, అదిరిందయ్యా చంద్రం లాంటివి మంచి విజయం సాధించాయి. ఇతరులతో కలిసి చేసిన సందడే సందడి, ప్రియమైన నీకు, శివరామరాజు, శ్రీరామచంద్రులు లాంటి హిట్లు బోలెడున్నాయి. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఆలోచనతో తీసుకున్న పన్నెండేళ్ల గ్యాప్ శివాజీ కెరీర్ ని మార్చేసింది. అయితేనేం ఇప్పుడు కోర్ట్ రూపంలో మంగపతి పెద్ద బ్రేక్ ఇచ్చాడు. అన్నట్టు కోర్ట్ చూశాక పలువురు స్టార్ డైరెక్టర్ల నుంచి అప్పుడే శివాజీకి విలన్ కాల్స్ వచ్చాయట.