‘పుష్ప’ గురించి ఇంత డిస్కషన్ మంచిది కాదు

అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’ గురించి ఏడాదికి పైగా ఇటు మీడియాలో, అటు అభిమానుల్లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఐతే ఆ సినిమా ఎంతకీ పట్టాలెక్కడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావడం లేదు. రకరకాల కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కరోనా తర్వాత కూడా సినిమాను మొదలుపెట్టడానికి సుకుమార్ అండ్ టీం సమయం తీసుకుంటుండటం ఆశ్చర్యం కలుగుతోంది.

ఐతే ఎట్టకేలకు షూటింగ్‌కు రంగం సిద్ధమైందని.. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవులతో పాటు విశాఖపట్నంలో కీలక సన్నివేశాల చిత్రీకరణకు షెడ్యూల్ ప్లాన్ చేశారని.. అతి త్వరలోనే టీం అంతా అక్కడికి వెళ్లబోతోందని వార్తలొస్తున్నాయి. ఈసారైనా సుక్కు నిజంగా షూటింగ్ మొదలు పెడతాడో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ చిత్రీకరణకు ముందు ఇంత చర్చ జరగడం సినిమాకు మంచిది కాదన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. అంటే చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోనే కథ నడుస్తుంది. సినిమాలో పాత్రధారుల యాస కూడా చిత్తూరుకు సంబంధించిందే ఉంటుంది. అలాంటపుడు సినిమా ఆ ప్రాంతంలో నడుస్తున్న భావన జనాల్లో కలిగించాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా షూటింగ్ గురించి ఇప్పటిదాకా వచ్చిన వార్తల్లో ఎక్కడా చిత్తూరు, కడప జిల్లాల ప్రస్తావన లేదు. సుక్కు అక్కడ చిత్రీకరణ చేయడని స్పష్టంగా జనాలకు అర్థమైపోయింది. కేరళ అని, వికారాబాద్ అని, మడ అడవులని, మారేడుమిల్లి అని, వైజాగ్ అని వేరే ప్రాంతాల పేర్లే వార్తల్లో ఉన్నాయి. ఈ చర్చ బాగా జరగడంతో జనాల్లో ఇది చిత్తూరు-కడప జిల్లాల పరిధిలో జరిగే కథ అన్న భావనే లేదు. సినిమాలో అలా చూపిస్తే కచ్చితంగా అథెంటిసిటీ సమస్య వస్తుంది. ఈ తరహా కథలకు అది చాలా అవసరం.

ఇంతకుముందు సుక్కు తీసిన ‘రంగస్థలం’ గోదావరి ప్రాంత నేపథ్యంలో నడిచే కథ. ఐతే ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు మాత్రమే అక్కడ చిత్రీకరించి.. మిగతా అంతా సెట్స్ వేసి లాగించేశారు. కానీ ఎక్కడా నేటివిటీ మిస్సయిన భావన కలగలేదు. ఆ సినిమా షూటింగ్ గురించి మీడియాలో పెద్దగా చర్చ జరక్కపోవడం, సుక్కు చడీచప్పుడు లేకుండా పని చేసుకుపోవడం వల్ల జరిగిన మేలిది. కానీ ‘పుష్ప’ గురించి మీడియాలో విపరీతమైన చర్చ జరగడం, చిత్రీకరణ ఎక్కడెక్కడ జరుగుతుందో జనాలకు ముందే క్లారిటీ రావడంతో రేప్పొద్దున సినిమా చిత్తూరు-కడప జిల్లాల పరిధిలో నడిస్తే దానికి ఏమేర కనెక్టవుతారన్నది సందేహం. అథెంటిసిటీ ఫ్యాక్టర్ సినిమాకు మైనస్ అయ్యే ప్రమాదముంది.