మెగా జోడి కోసం రావిపూడి ప్రయత్నాలు

సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఆలస్యం చేయకుండా చిరంజీవి సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసేస్తున్నాడు. సెంటిమెంట్ ప్రకారం వైజాగ్ లో మొదలుపెట్టిన రాత కార్యక్రమంలో ఫస్ట్ హాఫ్ అయిపోయిందని సమాచారం. మిగిలింది హైదరాబాద్ లోనే రాసేసి త్వరలోనే చిరంజీవికి వినిపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎప్పటికప్పుడు నేరుగా కాకపోయినా ఫోన్ ద్వారా దీని అప్డేట్స్ చిరు, రావిపూడి నిత్యం డిస్కస్ చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పుడో అసలు సవాల్ అనిల్ ముందు ఉంది. అదే మెగాస్టార్ కు సరైన జోడీని వెతికి పట్టుకోవడం.

సీనియర్ స్టార్లకు జంటను సెట్ చేయడం డైరెక్టర్లకు పెద్ద సవాల్ గా మారుతోంది. వెంకటేష్ కు ఐశ్వర్య రాజేష్ ని లాక్ చేయడానికి ముందు అనిల్ చాలా ఆప్షన్లు చూశాడు. కొందరు ఒప్పుకోలేదు. ఎస్ చెప్పిన కొందరు కోరుకున్న పెర్ఫార్మన్స్ ట్రయిల్ షూట్ లో ఇవ్వలేదు. దీంతో బాగా అలోచించి ఫైనల్ గా బెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. మీనాక్షి చౌదరికి సైతం చిన్నపాటి కసరత్తే జరిగింది. ఇప్పుడు చిరు పక్కన ఆడిపాడేందుకు సరైన ఛాయస్ కావాలి. అదితి రావుహైదరి పేరు వినిపిస్తోంది కానీ రావిపూడి స్కూల్ కు ఆమె ఎంత వరకు మ్యాచ్ అవుతుందనేది చూడాలి. అందుకే పరిశీలనలో పెట్టారట.

అసలే ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. ఎంతలేదన్నా రెండింట్లో చిరు పక్కన హీరోయిన్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎంపికనేది జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ సెట్ కాకపోతే ముంబై ఆప్షన్లు కూడా చూస్తున్నట్టు మరో అప్డేట్. విశ్వంభర ఒక పాట మినహా మొత్తం పూర్తయిపోయింది కాబట్టి మెగా అనిల్ ప్రాజెక్టు వేసవి నుంచి ప్రారంభం కావొచ్చు. ఎంత పోటీ ఉన్నా సరే 2026 సంక్రాంతికి విడుదల చేయాలని కంకణం కట్టుకున్న రావిపూడి బృందం దానికి తగ్గట్టే షెడ్యూల్స్ ని ప్లాన్ చేసిందట. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తరహా వైబ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని లీక్స్ ద్వారా తెలుస్తోంది.