ఊహించనంత వేగంగా అఖిల్ 6

ఏడాదిన్నర పాటు అభిమానులను వెయిటింగ్ లో ఉంచిన అఖిల్ కొత్త సినిమా కొన్ని వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళికిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీకి లెనిన్ పేరుని ఖరారు చేశారు. అయితే ఫ్యాన్స్ భావించినట్టు ఇది వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూసే అవసరం లేని ఇన్ సైడ్ టాక్. ఎల్లుండి నుంచి మొదలుపెట్టబోయే షెడ్యూల్ ని ఏకధాటిగా 20 రోజుల పాటు కొనసాగించి 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారని తెలిసింది. విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరపనున్నారట.

ఇప్పుడు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే లెనిన్ 2025 దసరా బరిలో దింపొచ్చు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ ఆ దిశగానే ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా రాయలసీమ నేపథ్యంలో ఉంటుందనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది. ఇందులో విలన్ గా స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ నటిస్తారనే ప్రచారం ఉన్నా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తమిళ నటుడు విక్రాంత్ కూడా లిస్టులో ఉన్నాడు. మంచి ఎమోషన్ తో కూడిన లవ్ స్టోరీ ఇందులో ఉంటుందని, అఖిల్ ఇప్పటిదాకా టచ్ చేయని విభిన్నమైన జానరని అంటున్నారు.

వినడానికి బాగానే ఉంది కానీ దసరాకి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లెనిన్ ఎంత మేరకు రాగలడనేది వెంటనే చెప్పలేం. ఎందుకంటే సెప్టెంబర్ చివరి వారంలో అఖండ 2 తాండవం, సంబరాల ఏటిగట్టు ఒకేరోజు వస్తాయి. అక్టోబర్ 2 కాంతార చాఫ్టర్ 1 ఆల్రెడీ లాక్ చేసుకుంది. వీటిలో ఎవరు వస్తారో ఎవరు డ్రాపవుతారనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లెనిన్ కనక దసరా మిస్సయ్యే పక్షంలో దీపావళి లేదా క్రిస్మస్ ఏదో ఒక ఆప్షన్ లాక్ చేసుకోవడం ఖాయమట. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది దాకా వెళ్లకుండా అఖిల్ ఫ్యాన్స్ కి కానుక ఇవ్వడం ఖాయమట. అన్నపూర్ణ స్టూడియోస్ దీనికి పెద్ద బడ్జెట్టే పెడుతోంది.