దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు వరస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండూ మాములు దెబ్బ కొట్టలేదు. ఫ్లాపులు ఎవరికైనా సహజమే కానీ వీలైనంత త్వరగా రేసులోకి రావడం చాలా కీలకం. ప్రస్తుతం పూరి అలాంటి ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం అఖిల్ కోసం ఒక కథ తయారు చేసుకుని వినిపించినట్టు టాక్ వచ్చింది కానీ వాస్తవానికి ఆయన నాగార్జునను కలిశారట. ప్రస్తుతం కుబేర, కూలిలో స్పెషల్ క్యామియోలు తప్ప నాగ్ సోలో హీరోగా ఇచ్చిన కమిట్ మెంట్లు లేవు. సబ్జెక్టులు వింటున్నారు కానీ గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం లేదు.
నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో రెండు సినిమాలొచ్చాయి. శివమణి సూపర్ హిట్ గా నిలిచి అభిమానులకు ఫుల్ మీల్స్ పంచింది. ఆ నమ్మకంతోనే నాగ్ తన స్వంత బ్యానర్ లో పూరితో సూపర్ తీయించారు. ధూమ్ స్ఫూర్తితో తీసిన ఈ హీస్ట్ థ్రిల్లర్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. అయితే పాటలు, అనుష్క పరిచయం, స్టైలిష్ మేకింగ్ మరీ బ్యాడ్ ఫిలిం కాకుండా కాపాడాయి. తర్వాత ఈ కలయిక మళ్ళీ రిపీట్ కాలేదు. ఇదంతా 2005 నాటి ముచ్చట. ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మరి రెండు దశాబ్దాల తర్వాత తమ కాంబోకు నాగార్జున ఓకే చెబుతారా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇదంతా గాసిప్ దశలోనే ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ సరైన కంటెంట్ కుదిరితే మాత్రం నాగ్ పూరి కలయిక నుంచి మరో యాక్షన్ మూవీని ఆశించవచ్చు. నా సామిరంగా తర్వాత నాగార్జున నెమ్మదించారు. ఒక తమిళ దర్శకుడు చెప్పిన ప్యాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పి ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో పెండింగ్ ఉంచేశారు. ముందుకెళ్లే సూచనలు తక్కువగా ఉన్నాయి. కుబేర జూన్ 20 విడుదల కానుండగా కూలి దసరా లేదా దీపావళి కానుకగా రానుంది. తండేల్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న అక్కినేని అభిమానులు ఈ ఏడాది తమ హీరోల హ్యాట్రిక్ హిట్లతో గ్యాప్ మొత్తం తీరిపోతుందని ఎదురు చూస్తున్నారు.