వరుస డిజాస్టర్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం.. గత ఏడాది ‘క’ సినిమాలో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ‘రూల్స్ రంజన్’ తర్వాత అతను చాలా గ్యాప్ తీసుకుని ఎంతో శ్రద్ధగా చేసిన సినిమా.. క. రిలీజ్ ముంగిట అతను ఈ చిత్రంపై పెట్టుకున్న నమ్మకం నిజమై బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది. ఈ మూవీలో మిగతా అంతా ఒకెత్తయితే.. క్లైమాక్స్ మరో ఎత్తు. అక్కడ వచ్చే ట్విస్ట్.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో వచ్చే ముగింపు సన్నివేశాలు సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచాయి. ఈ సినిమా క్లైమాక్స్‌ను విమర్శకులందరూ కూడా కొనియాడారు. క్లైమాక్స్ వల్లే సినిమా రేంజ్ మారిందని అభిప్రాయపడ్డారు. కానీ అదే క్లైమాక్స్ చూసి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.
రిలీజ్ ముంగిట ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్మే ప్రయత్నంలో జరిగిన అనుభవం గురించి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘క’ సినిమాలో మిగతా పోర్షన్లన్నీ నచ్చినా సరే.. సదరు ఓటీటీ సంస్థకు క్లైమాక్స్ నచ్చలేదట. అది వర్కవుట్ కాదన్న ఉద్దేశంతో సినిమాను వాళ్లు రిజెక్ట్ చేసినట్లు కిరణ్ తెలిపాడు. కానీ తాను, తన టీం మాత్రం ఆ క్లైమాక్స్ బాగా పేలుతుందనే ఉద్దేశంతో దాన్ని అలాగే కొనసాగించామన్నాడు. తన నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు పతాక సన్నివేశాలను మెచ్చారని.. సినిమా కూడా పెద్ద హిట్ అయిందని కిరణ్ తెలిపాడు.
‘క’ సినిమాను ఈటీవీ విన్ వాళ్లు కొని థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కాస్త క్రేజున్న సినిమాలను ఎక్కువగా అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 లాంటి సంస్థలే కొంటుంటాయి. ఆహా సైతం ‘క’ టైపు సినిమాలను కొంటూ ఉంటుంది. కానీ ఇవేవీ కాకుండా ఈటీవీ విన్ ‘క’ డిజిటల్ హక్కులను కొనడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే ఈ సినిమా ఆ సంస్థకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. పైరసీ సైట్లు సినిమాను లీక్ చేయలేని విధంగా ఏదో కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా ‘క’ పైరసీకి సైతం ఆ సంస్థ బాగానే అడ్డుకట్ట వేయగలిగింది.