స్ట్రెయిట్ సినిమాల తీరు – డబ్బింగ్ చిత్రాల జోరు

2025 కొత్త సంవత్సరంలో దాదాపు రెండున్నర నెలలు గడిచిపోయాయి. బాక్సాఫీస్ పరంగా ఫలితాలు విశ్లేషించుకుంటే జనవరి నుంచి మార్చి దాకా వచ్చిన సినిమాల్లో స్ట్రెయిట్ తో సమానంగా డబ్బింగ్ చిత్రాలు పోటీ పడటం ఒకపక్క ఆనందం, మరోపక్క ఆందోళన కలిగించేదే. జనవరిలో ‘మార్కో’ మరీ గొప్ప అద్భుతాలు చేయకపోయినా దాని మీద పెట్టిన పెట్టుబడి, థియేటర్ బిజినెస్ కి పెట్టిన సొమ్ముని సేఫ్ గా వెనక్కిచ్చి లాభాలు కూడా పంచింది. ఫిబ్రవరిలో రిలీజైన ‘ది రిటర్న్ అఫ్ ది డ్రాగన్’ కేవలం నాలుగు కోట్లకు అమ్ముడై ఫైనల్ రన్ అయ్యేలోపు దానికి మూడింతల ప్రాఫిట్ నిర్మాతల ముందు పెట్టనుంది.

తాజాగా విడుదలైన ‘ఛావా’కు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన దక్కుతోంది. హిందీ వెర్షన్ తో పోల్చుకుంటే ఆలస్యంగా వచ్చినా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్న వైనం కనిపిస్తోంది. బుక్ మై షోలో ఇప్పటికే లక్ష టికెట్ల అమ్మకాలు దాటిపోగా మొదటి రోజు గ్రాస్ మూడు కోట్లను చేరుకుంది. సో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పంట పండినట్టే. ఇవన్నీ అనువాదాలు కాబట్టి రిస్క్ ఫాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇక స్ట్రెయిట్ సినిమాల సంగతి చూస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడు వందల కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాక దాంతో పాటు వచ్చిన ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్ ముద్రతో క్షేమంగా బయటపడింది.

నిన్న నెలలో ‘తండేల్’ వంద కోట్ల గ్రాస్ అందుకుని నాగచైతన్యకు ఊరట కలిగించింది. ఇవి మినహాయిస్తే తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ మేజిక్ చేయలేకపోయాయి. మంచి అంచనాలు మోసిన మజాకా, బ్రహ్మ ఆనందం, రామం రాఘవం లాంటివి తీవ్రంగా నిరాశపరిచాయి. అలాని డబ్బింగులన్నీ భీకరంగా ఆడాయని కాదు. అజిత్ ‘పట్టుదల’కు కనీసం పబ్లిసిటీ ఖర్చులు రాలేదు. జివి ప్రకాష్ ‘కింగ్స్టన్’ సైతం ఇదే దారిలో వెళ్తోంది. కాకపోతే గత ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకుని చూస్తే అనువాదాలు సక్సెస్ రేట్ పెరుగుతున్న మాట వాస్తవం. ఒకరకంగా ఇది వార్నింగ్ బెల్ లాంటిది. మంచి కంటెంట్ ఇవ్వకపోతే ఇవే రిపీటవుతాయి.