10 రోజుల తర్వాత క్లైమాక్స్ మార్చేశారు

ఏదైనా సినిమాకు ముగింపు చాలా కీలకం. ఒక్కోసారది కనెక్ట్ కాకపోతే మొదటి నుంచి చివరి దాకా ఎంత బాగా తీసినా ఫలితం తేడా కొట్టొచ్చు. ఉదాహరణకు చక్రం తీసుకుంటే చివరి ఘట్టంలో ప్రభాస్ ని జబ్బుతో చంపేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే ప్రేమ, గీతాంజలిలో వేరే తరహా ఎండింగ్ తో శుభం కార్డు వేయడం వల్ల క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఇటీవలే బాలీవుడ్ మూవీ క్రేజీ రిలీజయ్యింది. పబ్లిసిటీ బాగానే చేయడంతో ఓపెనింగ్స్ వచ్చాయి. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ గా విమర్శకులు మెచ్చుకున్నారు. అయితే క్లైమాక్స్ విషయంలో అధిక శాతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

దీంతో పది రోజుల తర్వాత క్లైమాక్స్ మార్చేశారు. రేపటి నుంచి కొత్త వెర్షన్ ఉంటుంది. అసలంతగా ఏముందో ఓ లుక్ వేద్దాం. డాక్టర్ అభిమన్యు (సోహుమ్ షా) తప్పు లేకుండానే అనూహ్య పరిస్థితుల్లో ఆసుపత్రి పేషేంట్ మరణిస్తాడు. ఇది కనక బయటికి వస్తే తన లైసెన్స్ క్యాన్సిలైపోయి వైద్య వృత్తి మానేయాల్సి వస్తుదేననే భయంతో అయిదు కోట్లకు సెటిల్మెంట్ మాట్లాడుకుంటాడు. కారులో డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి ఫోన్ చేసి నీ కూతురిని కిడ్నాప్ చేశానని, అయిదు కోట్లు ఇస్తే వదిలిపెడతానని బేరం పెడతాడు. దీంతో అయోమయంలో పడ్డ అభిమన్యు ఏం చేశాడనేది క్రేజీ పాయింట్.

కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న క్రేజీ సోహుమ్ షా (నిర్మాతల్లో ఒకరు) వన్ మ్యాన్ షోగా జరుగుతుంది. అయితే ఏకపాత్రాభినయం తరహాలో స్క్రీన్ ప్లే రాయడంతో పాటు ఊహించనిదే అయినా క్లైమాక్స్ ని హ్యాండిల్ చేసిన విధానం సంతృప్తిగా అనిపించదు. ఇంతోటి దానికి బిల్డప్ ఇచ్చారా అనిపిస్తుంది. ఇది గుర్తించిన దర్శకుడు గిరీష్ కోహ్లీ టీమ్ ఆఘమేఘాల మీద చివరి ట్విస్టులను మార్చేసి కొత్తగా చూడమంటోంది. జనాల కోసం వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ కూడా ప్రకటించింది. అయినా ఒక సినిమా పది రోజులు గట్టిగా ఆడితే గొప్పనుకునే రోజుల్లో ఇలా క్లైమాక్స్ మార్చేసి మళ్ళీ చూడమని పిలుపివ్వడం విచిత్రమే.