మలయాళం సూపర్ హిట్ మూవీ మార్కో ఒరిజినల్ వెర్షన్ తో పాటు హిందీలోనూ భారీ వసూళ్లు తేవడం చూశాం. తెలుగు లాంటి ఇతర డబ్బింగ్ భాషల్లో పర్వాలేదనిపించుకుంది కానీ అందులో ఉన్న వయొలెన్స్ రోజుల తరబడి డిస్కషన్ టాపిక్ అయ్యింది. స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని దారుణమైన హింసని విలన్, హీరో రూపంలో చూపించిన తీరు కళ్ళు మూసుకునేలా చేసింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చేసి సరిపుచ్చుకుంది కానీ వయసుతో సంబంధం లేకుండా సింగల్ స్క్రీన్లలో లక్షాలాది ప్రేక్షకులు చూసేశారు. ఇదే సినిమా టీవీ ఛానల్ లో ప్రసారం చేస్తే ఎలా ఉంటుంది. చూసేవాళ్లును కట్టడి చేయడం సాధ్యమా.
అందుకే మార్కో శాటిలైట్ ప్రీమియర్ కు బ్రేక్ పడింది. సెంట్రల్ బోర్డ్ అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ శాటిలైట్ ప్రసారం అనుమతిని నిషేధించమే కాక ఇకపై ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో కూడా ఇది ఉండకూడదంటూ రీజనల్ ఆఫీసర్ నదీమ్ తుఫాలీ లేఖ రాయడం మల్లువుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. థియేటర్ రన్ అయ్యాక టీవీలో వేయాలన్నా సరే మళ్ళీ సెన్సార్ చేయించాల్సి ఉంటుంది. మార్కోకి ఇక్కడ స్పీడ్ బ్రేక్ పడింది. అయితే ఫిలిం ఫెడరేషన్ ఎంప్లొయ్స్ అఫ్ కేరళ దీని పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సమాజం పట్ల సినిమా ప్రభావం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతోంది.
కొన్ని నెలల క్రితం ఫాహద్ ఫాసిల్ ఆవేశం చూసి కొందరు కాలేజీ విద్యార్థులు గ్యాంగ్ స్టర్లను కలిసే ప్రయత్నం చేయడం పోలీసులను నివ్వెరపరిచింది. కేరళ సిఎం పినరయ్ విజయన్ ఈ పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మార్కో నిర్మాత ఇకపై తన సినిమాల్లో ఇంత హింస లేకుండా చూసుకుంటానని స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. అయినా క్రియేటివ్ లిబర్టీ పేరుతో హింసని హద్దులు దాటించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. మార్కోలో ఇది శృతి మించి పోయింది. వంద కోట్ల వసూళ్లు వచ్చి ఉండొచ్చు కానీ దాన్నే ప్రామాణికంగా తీసుకుని దర్శక రచయితలు ఇలాంటి కథలే తీస్తే అసలు ముప్పు వస్తుంది.