వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా విజయం అందని ద్రాక్షగా మారిపోయిన సుధీర్ బాబు కొత్త ప్యాన్ ఇండియా మూవీ జఠాధర భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దీని కోసమే ఫిజికల్ ఫిట్ నెస్ మరింత మెరుగుపరుచుకున్న నవ దళపతి ఈసారి గురి తప్పదనే లక్ష్యంతో విపరీతంగా కష్టపడుతున్నాడు. సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ ఈ సినిమాతోనే ఈ ఎంట్రీ ఇస్తోంది. అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించిన రహస్యాలను నేపథ్యంగా తీసుకున్న దర్శకడు వెంకట్ కళ్యాణ్ చాలా గ్రిప్పింగ్ నెరేషన్ తో స్క్రీన్ ప్లేని రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. హీరోయిన్ క్లారిటీ వచ్చేసింది.
దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హాని జఠాధరలో కథానాయకిక్గా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇది తనకు టాలీవుడ్ డెబ్యూ. తమిళంలో ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగ చేసింది కానీ ఆశించిన ఫలితం దక్కపోవడంతో హిందీకే పరిమితమయ్యింది. లెజెండరీ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురైన సోనాక్షికి దబాంగ్ భామగానే ఎక్కువ గుర్తింపు ఉంది. నటనకు సంబంధించి బోలెడు టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు వేగంగా రాలేదు. చేసిన వాటిలో అధిక శాతం ఫ్లాప్ కావడంతో రేసులో వెనుకబడింది. ఇప్పుడు సుధీర్ బాబుకి జోడిగా దక్షిణాదిలో కొత్త బ్రేక్ అందుకోవాలని ఎదురు చూస్తోంది.
ఇక సుధీర్ బాబు విషయానికి వస్తే జఠాధర మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. హరోంహరతో మాస్ టర్నింగ్ తీసుకున్న సుధీర్ ఆ తర్వాత మా నాన్న సూపర్ హీరోతో ఎమోషనల్ సబ్జెక్టు చేశాడు కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. అందుకే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఫాంటసీ థ్రిల్లర్ వైపు మొగ్గు చూపాడు. అయిదు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. బడ్జెట్ ఎంతో బయటకి చెప్పలేదు కానీ డెబ్భై కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని వినికిడి. హీరో మార్కెట్ మీద కాకుండా కంటెంట్ ని నమ్ముకుని ఇంత ఖర్చు పెడుతున్నారంటే సుధీర్ బాబు కాన్ఫిడెన్స్ ఈసారి గెలిచేలా ఉంది.